Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన పంజాబ్ బ్యాంక్ కుంభ‌కోణం

By:  Tupaki Desk   |   15 Feb 2018 7:04 AM GMT
షాకింగ్ గా మారిన పంజాబ్ బ్యాంక్ కుంభ‌కోణం
X
సామాన్యుడికి లక్ష రూపాయ‌లు ఇవ్వాలంటే చుక్క‌లు చూపిస్తుంటారు బ్యాంక్ సిబ్బంది. ఇచ్చిన ప‌త్రాల్ని అదే ప‌నిగా ఇవ్వ‌మ‌ని చెప్ప‌టం ద‌గ్గ‌ర నుంచి.. చిన్న చిన్న విష‌యాల‌కు సైతం ఇబ్బంది పెట్టి తిప్పించుకుంటూ ఉంటారు. ఓ ప‌క్క సామాన్యుడికి సినిమా చూపించే బ్యాంకులు.. త‌మ‌కు న‌చ్చిన వారి విష‌యంలో రూల్స్ ను ఇష్టారాజ్యంగా బ్రేక్ చేయ‌ట‌మే కాదు.. వేలాది కోట్ల రూపాయిల ప్ర‌జాధ‌నాన్ని ప‌క్క‌దారికి మ‌ళ్లించే వైనం విస్తుపోయేలా చేస్తోంది.

దేశ బ్యాంకింగ్ రంగంపై ఉన్న విశ్వాసాన్నే స‌డ‌లించేలా ఒక భారీ కుంభకోణం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌రైన లెక్కా ప‌త్రాలు లేకున్నా.. అధికారుల‌తో కుమ్మ‌క్కు అయిన ఒక ప్ర‌ముఖ జ్యువెల‌రీ డిజైన‌ర్ అత‌డి గ్యాంగ్ కార‌ణంగా భారీ స్కాం చోటు చేసుకుంది. ముంబ‌యిలోని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కు చెందిన ఒక బ్రాంచ్ ద్వారా రూ.11,346 కోట్ల అక్ర‌మ లావాదేవీలు జ‌రిగిన‌ట్లుగా గుర్తించారు. బ్యాంకు సిబ్బందితో క‌లిసి 2011 నుంచి ఈ దారుణానికి పాల్ప‌డుతున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కుంభకోణం ఎలా జ‌రిగింది?

కొంత‌మంది ఖాతాదారుల‌కు ల‌బ్థి క‌లిగించ‌టానికి త‌మ సిబ్బంది త‌ప్పుడు లెట‌ర్ ఆఫ్ అండ‌ర్ టేకింగ్ ద్వారా కుట్ర ప‌న్నిన‌ట్లుగా పంజాబ్ బ్యాంక్ అనుమానం వ్య‌క్తం చేసింది. ఈ ప‌త్రాల్ని చూపించి విదేశాల్లోని భార‌తీయ బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఉంటార‌ని చెబుతున్నారు. ఈ తీరులో యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అల‌హాబాద్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ ప‌త్రాల్ని తీసుకొని రుణాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. పంజాబ్ బ్యాంక్ పేరును రుణాలు ఇచ్చిన బ్యాంకులు పేర్కొన‌లేదు. అదే స‌మ‌యంలో అభ‌ర‌ణాల కంపెనీ పేరును బ్యాంకులు వెల్ల‌డించ‌లేదు. వాస్త‌వానికి అస‌లు ఎలా కుంభ‌కోణం జ‌రిగింద‌న్న విష‌యాన్ని వివ‌రంగా బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఈ ఉదంతంలో పంజాబ్ బ్యాంక్ శాఖ డిప్యూటీ మేనేజ‌ర్ తో స‌హా 10 మంది ఉద్యోగుల‌పై బ్యాంకు వేటు వేసింది. గ‌డిచిన ప‌ది రోజ‌ల్లో ఈ త‌ర‌హా అక్ర‌మ లావాదేవీలు బ‌య‌ట‌కు రావ‌టం ఇది రెండోసారి. ఈ కుంభ‌కోణానికి మూల విరాట్టు నీర‌వ్ మోదీ గా గుర్తించారు. ఈ కేసును సీబీఐకి బ‌దిలీ చేశారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఆర్థిక సేవ‌ల విభాగం బ్యాంకుల‌కు కొత్త ఆదేశాలుజారీ చేసింది. దేశంలోని అన్ని బ్యాంకులు ఈ వారాంతంలోపు స్టేట‌స్ నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన కుంభ‌కోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ను కుదిపేస్తోంది. ఈ అక్ర‌మ లావాదేవీల కార‌ణంగా బ్యాంకు షేర్ విలువ ప్ర‌భావిత‌మ‌వుతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే మొండి బ‌కాయిల‌తో స‌త‌మ‌త‌వుతున్న బ్యాంకుకు ఈ స్కాం పుణ్య‌మా అని మ‌రింత సంక్షోభంలోకి వెళ్లే అవ‌కాశం ఉందని చెబుతున్నారు. ఈ భారీ కుంభ‌కోణం బ‌య‌ట‌కు రావ‌టంతో బ్యాంక్ షేర్లు కుప్ప‌కూలాయి. ఈ షేరు బుధ‌వారం ఒక్క‌రోజులో 9.81 శాతం న‌ష్ట‌పోయింది. ఈ బ్యాంక్ షేర్ల‌లో మ‌దుపు చేసిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌న దాదాపు రూ.3844 కోట్లు హ‌రించుకుపోయింది.

దేశం యావ‌త్తు షాక్ తినేలా కుంభ‌కోణానికి పాల్ప‌డిన నీర‌వ్ మోదీ ఎవ‌రు? ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నేసి వేల కోట్ల రూపాయిల్ని బ్యాంకుల్ని ఎలా బోల్తా కొట్ట గ‌లిగారు? లాంటి వివ‌రాల్లోకి వెళితే.. వ‌జ్ర‌.. బంగారు ఆభ‌ర‌ణాలకు కొత్త ఆకృతులు ఇచ్చే విష‌యంలో నీర‌వ్ మోదీకి మంచి పేరుంది. ప్ర‌పంచంలో వ‌జ్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పే బెల్జియంలోని యాంట్వెర్ప్ లో పెరిగిన వ్య‌క్తి సాయంతో త‌న పేరిట ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. చిన్న వ‌య‌సులోనే బిలియ‌నీర్ గా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. వ‌జ్ర వ్యాపారుల కుటుంబంలో పుట్టిన నీర‌వ్ 2.3 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఫైర్ స్టార్ డైమండ్ అనే సంస్థ‌ను స్థాపించాడు. చైనా నుంచి ఉత్త‌ర అమెరికాలోని హ‌వాయి దీవుల వ‌ర‌కు మూడు ఖండాల్లో త‌న వ్యాపారాన్ని త‌క్కువ వ్య‌వ‌ధిలోనే విస్త‌రించాడు. భార‌త్ లో అతి చిన్న వ‌య‌సులోనే బిలియ‌నీర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

శ‌క్తివంత‌మైన వ్యాపార సామ్రాజ్యంతో పాటు.. రాజ‌కీయంగా కూడా బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని చెబుతారు. 2013లో తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన అత‌గాడు 2016 ఫోర్బ్స్ జాబితాలో ప్ర‌పంచ స్థాయిలో 1067 ర్యాంక్ ద‌క్కించుకున్నాడు. భార‌త బిలియ‌నీర్ల‌లో 46వ‌స్థానం ద‌క్కింది. నిరుడు భార‌త్ లో 82వ ర్యాంక్ ద‌క్కింది. 2017లో 57వ స్థానానికి చేరుకున్నాడు. 2016లో న్యూయార్క్ లో ఒక స్టోర్ తెరిచిన నీర‌వ్‌.. త‌న వ్యాపారాల‌ను విశ్వ‌వ్యాప్తం చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. త‌న డిజైన్ల‌కు ప్రియాంక చోప్రాను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేసుకున్నాడు. ల‌గ్జ‌రీ డైమండ్స్ కు పెట్టింది పేరుగా ఆయ‌న బ్రాండ్ ను చెబుతారు. వ‌జ్రాల‌ను కేవ‌లం ఆభ‌ర‌ణాలుగా కాకుండా పెట్టుబ‌డులుగా ప్ర‌మోట్ చేయ‌టంలో నీర‌వ్ కు ప్ర‌త్యేక‌మైన నేర్పు ఉంద‌ని చెబుతారు. ప్ర‌ఖ్యాత సంస్థ‌లైన క్రిస్టీ.. సోథిబే లు చేప‌ట్టే వేలం పాట‌ల్లో త‌ర‌చూ పాల్గొన‌టం నీర‌వ్‌కు అల‌వాటు. అయితే.. ఇత‌ని ఆర్థిక మూలాల‌న్నీ బ్యాంకును న‌ట్టేట ముంచుతూ అన్నది తాజాగా వెలుగులోకి వ‌చ్చిందని చెప్పాలి.