Begin typing your search above and press return to search.

పెరుగుతున్న 'పంజాబ్' పంచాయతీ

By:  Tupaki Desk   |   7 Jan 2022 5:44 AM GMT
పెరుగుతున్న పంజాబ్ పంచాయతీ
X
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంజాబ్ పంచాయతీ పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడటం కూడా ఈ పంచాయితికి పరోక్షంగా కారణమవుతోంది. తొందరలోనే ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ భద్రతా లోపాల అంశాన్ని వీలైనంతగా పెద్దది చేసి సానుభూతి పొందాలన్న ఆలోచననే కేంద్రం, బీజేపీలో కనబడుతోంది.

ఇదే సమయంలో సానుభూతి కోసం మోడీ ఆడుతున్న నాటకంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. పంజాబ్ లో రెండు రోజుల క్రితం బటిండా నుంచి రోడ్డు మార్గంలో వెళుతున్న మోడీ కాన్వాయ్ ను ఒక ఫ్లైఓవర్ దగ్గర కొందరు రైతులు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి రోడ్డుకు అడ్డంగా పెట్టున్న వాహనాలను తొలగించమని ఎవరైనా అడిగితే తొలగొంచేవారేమో. కానీ ఆ పని చేయకుండా తన కాన్వాయ్ లోనే మోడీ 20 నిముషాలు వెయిట్ చేసి తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్ళిపోయారు.

ఇక్కడే మోడీ నాటకీయతకు తెరలేపారు. తనను క్షేమంగా వెళ్ళనిచ్చిందుకు పంజాబ్ ప్రభుత్వానికి థ్యాంక్స్ అంటు చేసిన ట్వీట్ తో గొడవ మొదలైంది. క్షేమంగా తిరిగి వెళ్లనివ్వడం అనటంలో అర్ధం లేదు. ఎందుకంటే మోడీపై ఎవరు దాడి చేయలేదు. మోడీ కాన్వాయ్ కు రైతుల వాహనాలకు మధ్య చాలా దూరముంది. రైతుల్లో ఎవరు కూడా మోడీ దగ్గరకు రావటానికి కూడా ప్రయత్నించలేదు. అలాంటపుడు ఇక క్షేమంగా తిరిగి వెళ్ళటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.

జరిగిన ఘటనకు పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యతంటు ప్రధాని, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారు. తాజాగా తనపై దాడికి కుట్ర జరిగినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన మోడీ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. మోడిని చంపడానికే పంజాబ్ ప్రభుత్వం కుట్ర చేసిందంటు కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరాని, రాజ్ నాథ్ లాంటి వాళ్ళు గోల చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

వీళ్ళ గోల ఇలాగుంటే రైతుల దెబ్బ ఏమిటో మోడీకి ఇప్పటికైనా తెలిసిందా అంటూ పంజాబ్ లోని రైతు సంఘాలు హెచ్చరికలు మొదలయ్యాయి. యూపీలో రైతుల మీదకు వాహనాన్ని నడిపి చావుకు కారణమైన నాయకుడి తండ్రిని మోడీ ఇంకా కేంద్రమంత్రి వర్గంలో ఎంతకాలం ఉంచుకుంటారని నిలదీస్తున్నారు. ఏడాది కాలం చేసిన ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని మోడీకి ఎందుకు అనిపించలేదని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమకాలంలో రైతులు చనిపోవటానికి మోడీయే కారణమంటూ రైతు సంఘాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. మొత్తానికి భద్రతా వైఫలమనే ఘటనపై గోల మొదలైపోయింది.