Begin typing your search above and press return to search.

పడి ఉన్న ఖురాన్ పేజీలతో ఎంత రచ్చ అంటే..?

By:  Tupaki Desk   |   26 Jun 2016 10:07 AM GMT
పడి ఉన్న ఖురాన్ పేజీలతో ఎంత రచ్చ అంటే..?
X
రోడ్డు మీద పడి ఉన్న ఖురాన్ పేజీల కారణంగా పంజాబ్ లోని లూదియానలో రచ్చ రచ్చగా మారిన పరిస్థితి. ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలీకున్నా.. రోడ్డు మీద పడిపోయి ఉన్న ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ లోని కొన్ని పేజీలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. లూధియానలోని మెలెర్ కోట్లాలోని చౌక్ ప్రాంతంలో ఖురాన్ పేజీలు కొన్ని చిరిగిపోయి పడి ఉంటాన్ని కొందరు గుర్తించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 250 మంది ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఫర్జానా నిస్సారా ఖతూన్ ఇంటికి వెళ్లారు.

తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారిని ఎమ్మెల్యే నివాసంలోకి అనుమతించేందుకు భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేను కలుసుకునేందుకు భద్రతా సిబ్బంది అడ్డుకోవటంపై తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడి చేసిన ఆందోళనకారులు.. పనిలోపనిగా ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి.. ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసి ఆగమాగం చేసేవారు.

ఎమ్మెల్యే వాహనాల్ని ధ్వంసం చేయటంతో పాటు.. మరో ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. దీంతో.. ఒక్కసారిగా ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వివరాలు అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో దాదాపు 250 మందిపై పోలీసులు వివిధ కేసుల్ని నమోదు చేశారు. అయితే.. ఇంతవరకూ ఈ అల్లర్లకు పాల్పడిన వారిలో ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయకపోవటం గమనార్హం.