Begin typing your search above and press return to search.
నాని ప్రధానిని కించపరుస్తారా?:పురంధరేశ్వరి
By: Tupaki Desk | 21 July 2018 2:08 PM GMTనిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ హావభావాలు - నటన ఆకట్టుకున్నాయని.....ప్రపంచంలోనే గొప్ప డ్రామా ఆర్టిస్ట్ - నటుడు మోడీ అనడంలో ఎటువంటి సందేహం లేదని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. గంటన్నర పాటు సాగిన మోడీ ప్రసంగం......బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీని తలదన్నే రీతిలో ఉందని ఎద్దేవా చేశారు. 2014కు ముందు కూడా మోడీ ఇదే తీరులో నటించారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత పురంధరేశ్వరి స్పందించారు. నటుడు - డ్రామా ఆర్టిస్ట్ అని ప్రధాని మోదీని కించపరిచేలా హేయంగా మాట్లాడడం సమంజసం కాదని ఆమె అన్నారు. నిజంగా అబద్దాలు చెప్పేది ఎవరు...అభివృద్ధిని ఆకాంక్షించేది ఎవరు అని ఏపీ ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఆ కాంగ్రెస్ మద్దతుతోనే అవిశ్వాసం పెట్టి పార్లమెంట్ లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నిటీడీపీ నాయకులు తాకట్టు పెట్టారని పురంధరేశ్వరి మండిపడ్డారు. రాహుల్ మొత్తం ప్రసంగంలో ఏపీకి హోదా ప్రస్తావనే తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ఏమడిగినా ప్రధాని నరేంద్ర మోదీ - కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని - కానీ, ఏం కావాలో అడగకుండా టీడీపీ కాలయాపన చేస్తోందని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీపై టీడీపీ అబద్ధాలు చెప్పిందన్నారు. దుగరాజుపట్నం - కడప స్టీల్ ప్లాంట్ ఆలస్యం కావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని - వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు.