Begin typing your search above and press return to search.

ఏపీకి కేంద్రమంత్రి పదవి ఆఫర్.. బరిలో వీరే..!

By:  Tupaki Desk   |   27 July 2019 10:15 AM GMT
ఏపీకి కేంద్రమంత్రి పదవి ఆఫర్.. బరిలో వీరే..!
X
దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఏపీలో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో ఆ రాష్ట్రానికి కేంద్రమంత్రి పదవిని ఇవ్వలేకోపోయింది. అయితే సామాజిక - జాతీయ కోణంలో రాష్ట్రానికి ఒకటి చొప్పున ఏపీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది.. తెలంగాణలో గెలిచిన కిషన్ రెడ్డియే ఇప్పుడు కేంద్ర మంత్రి కోటాలో ఏపీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. త్వరలోనే ఏపీకి కొత్త కేంద్ర మంత్రి పదవిని ఇవ్వడానికి బీజేపీ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

ఏపీలో ఎలాగూ ఎవరూ గెలవలేదు.. మరి కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ప్రధానంగా ముగ్గురి పేర్లు ఏపీ నుంచి కేంద్రమంత్రి పదవిలో వినపడుతున్నాయి. అందరికంటే ముందున్న వారు పురంధేశ్వరి. ఎన్టీఆర్ కూతురు 2014 - 2019లో బీజేపీ ఎంపీగా పోటీచేసి వరుసగా ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఏపీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి చాలా యాక్టివ్ పాలిటిక్స్ నడుపుతున్నారు. చురుకుగా పార్టీ కోసం పాటుపడుతున్నారు.

ఇక ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సుజనా చౌదరి కూడా గతంలో మోడీ కేబినెట్ లో మంత్రిగా చేశారు. ఏపీ కోటాలో తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారట.. అయితే టీడీపీ నుంచి వచ్చి చేరిన వీరికి మోడీ మంత్రి పదవులు ఇవ్వడం కొంచెం కష్టమేనంటున్నారు.

వీరిద్దరే కాక ఏపీకే చెందిన జీవీఎల్ నరసింహరావు కూడా కేబినెట్ మంత్రి పదవి రేసులో ముందున్నారు. అయితే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఏపీ కోటాలో మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే ఆయనను దూరంగా పెట్టారు.

ఇప్పుడు పురంధేశ్వరి - సుజనా చౌదరిలో సబ్జెక్ట్ పరంగా - భాష - దూకుడు - ప్రచారంలో దూసుకుపోగల సత్తా విషయంలో పురంధేశ్వరి ముందున్నారు. సుజన ఈ విషయంలో ఆమెకు పోటీనిచ్చే దాఖలాలే లేవంటున్నారు. మరి మోడీ కనుక ఏపీకి కేంద్రమంత్రి ఇవ్వాలనుకుంటే ముందుగా పురంధేశ్వరిని రాజ్యసభ ఎంపీగా పంపి ఆ తర్వాత ఆమెకు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చే చాన్స్ ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.