Begin typing your search above and press return to search.

అంతా టీడీపీ వ‌ల్లేన‌ని తేల్చిన చిన్న‌మ్మ‌

By:  Tupaki Desk   |   24 April 2016 11:32 AM GMT
అంతా టీడీపీ వ‌ల్లేన‌ని తేల్చిన చిన్న‌మ్మ‌
X
తెలుగుదేశం-బీజేపీల మ‌ధ్య స‌న్న‌గిల్లుతున్న మిత్ర‌బంధానికి తాజా ఉదాహ‌ర‌ణ ఇది. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యురాలు - కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మ‌రోమారు తెలుగుదేశం పార్టీ టార్గెట్‌ గా విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ...తెలుగుదేశం తీరు వ‌ల్లే అది జ‌ర‌గ‌డం లేద‌న్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

గుంటూరు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు ఖర్చుపైనా కేంద్ర నివేదిక కోరితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం - టిడిపి నేతలు కేంద్రం నిధులివ్వడం లేదని దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకూ డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వకున్నా కేంద్రం రూ. రెండు వేల కోట్ల వరకూ నిధులు మంజూరు చేసిందని వివ‌రించారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను దశలవారీగా ఆమలు చేయడానికి కేంద్ర కట్టుబడి ఉందని పురందేశ్వరి పున‌రుద్ఘాటించారు. అనేక విద్యాసంస్థ‌ల‌ను ఆంధ్రప్ర‌దేశ్‌ కు మంజూరు చేయ‌డ‌మే కాకుండా వాటిని త‌గు విధంగా నిధులు ఇస్తున్న‌ట్లు తెలిపారు.

టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయంపై ప్రతిష్టంభన ఏర్పడిందని పురందేశ్వ‌రి వ్యాఖ్యానించారు. స‌మ‌న్వ‌యం కోసం ఏర్పాటు చేసిన క‌మిటీలో ఎవరుండాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు పేర్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. సమన్వయం అనేది కేవలం నాయకుల మధ్య కాదని క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య కార్యకర్తల స్థాయిలో ఉండాలని చెప్పారు.