Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ మాట : ప్ర‌త్యేకం కోసం ఆశ‌ప‌డ‌వద్ద‌ట‌

By:  Tupaki Desk   |   25 Sep 2015 2:47 PM GMT
చిన్న‌మ్మ మాట : ప్ర‌త్యేకం కోసం ఆశ‌ప‌డ‌వద్ద‌ట‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంజీవ‌నిగా భావిస్తున్న ప్ర‌త్యేక హోదాపై బీజేపీ త‌న వైఖ‌రిని నెమ్మ‌దిగా బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌లు బీజేపీ అగ్ర‌నేత‌ల నుంచి కాకుండా...ఏపీకి చెందిన బీజేపీ నాయ‌కుల నుంచి వ‌స్తున్న‌వి కావ‌డం ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే హోదాకు ప్ర‌త్యామ్నాయంగా... ప్ర‌త్యేక ప్యాకేజీ అంశాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదాపై ఆశ‌లు వ‌దులుకోండ‌నే దిశ‌గా సంకేతాలు ఇస్తున్నారు. ఏపీకి చెందిన బీజేపీ నాయ‌కురాలు, మాజీ కేంద్ర‌మంత్రి ద‌గ్గుబాటి పురందీశ్వ‌రి ఈ మేర‌కు స్ప‌ష్ట‌త ఇచ్చారు.

చిత్తూరు జిల్లాలో పర్యట‌న సంద‌ర్భంగా బీజేపీ నేత హోదాలో పురందేశ్వరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ అన్నివిధాలుగా కృషిచేస్తోంద‌ని తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీల‌ను నిలుపుకోవ‌డంలో కేంద్ర క్రియాశీలంగా కృషిచేస్తోంద‌న్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం పాకులాడకుండా ప్రత్యేక ప్యాకేజీతో ఏపీని అభివృద్ధి చేసుకోవచ్చని ఆమె తెలిపారు. మ‌రోవైపు ఏపీ సీఎం చంద్రబాబు పోలవరాన్ని అంకితభావంతో, త్వరగా పూర్తి చేయాలన్నారు. పట్టిసీమకు పెట్టే ఖర్చు పోలవరానికి ఖర్చు చేస్తే రాయలసీమకు నీళ్లు వచ్చి ఉండేద‌ని చంద్ర‌బాబు ప్రభుత్వాన్ని త‌ప్పుప‌ట్టారు. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏపీలో బీజేపీ ఎదుగుద‌ల‌పై పురందీశ్వ‌రి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌న్నారు. అయితే ఏపీ బీజేపీ ఆ వేగాన్ని అందుకోవ‌డంలేద‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పురందేశ్వరి ఆదేశించారు. పార్టీ బ‌లోపేతానికి కృషిచేయాల‌ని సూచించారు.