Begin typing your search above and press return to search.

జగన్‌ బాటలో చిన్నమ్మ

By:  Tupaki Desk   |   8 April 2015 7:14 AM GMT
జగన్‌ బాటలో చిన్నమ్మ
X
దగ్గుబాటి పురందేశ్వరి... ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆనాటి పాలకుల నిర్ణయాలకే సై అన్నారు తప్ప ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోలేదనే అపప్రద కలిగి ఉన్న నాయకురాలు. విభజన సమయంలో కేంద్రంలో మంత్రిగా ఉన్న పురందేశ్వరి... ఆ తర్వాత అధికార పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ ఏదైనా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాల్సిన నాయకురాలిగా కాకుండా... వ్యక్తిగత ఆపేక్షతో మాట్లాడుతున్న చిన్నమ్మ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.

అమలాపురంలో జరిగిన ఓ సమావేశంలో పురందీశ్వరీ మాట్లాడుతూ.. పట్టిసీమపై తనకున్న కక్షనంతా వెల్లగక్కారు. రాయలసీమకు నీరు తరలించే లక్ష్యంతో పట్టిసీమ ప్రాజెక్టును ఏర్పాటుచేసినట్లు ప్రకటించి ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలోఉన్న హంద్రీనీవా, గాలేరు వంటి పెండింగ్‌ ప్రాజెక్టులకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిధులను మళ్లిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం పట్టిసీమను చేపడుతున్న నేపథ్యంలో అందుకు కేంద్రం అనుమతించే అవకాశం తక్కువని ఆమె అన్నారు.

స్వరాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పురందీశ్వరీ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఏంటని పలువుర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఏనాడూ ఆమె కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి అడగనే లేదు. విభజన సమయంలో ఏపీకి హామీ ఇచ్చిన ఐఐఎం, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటుచేయడం వంటి వాటి ఊసే ఎత్తలేదు. ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో కేంద్రం పట్టించుకోకున్నా, కావాలని జాప్యం చేస్తున్నా..ఈ వైఖరి సరైనది కాదు అనే మాట కూడా పురందీశ్వరి నోటి నుంచి రాలేదంటే ఆమె ఎంతగా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నన్నాళ్లు కాంగ్రెస్‌ కు వంతపాడుతూ ఏపీ విభజన ఘట్టాన్ని పూర్తిచేసిన ఈ కేంద్ర మాజీ మంత్రి..ఇపుడు పాలకపక్షం ఆలోచనలకు అనుగుణంగా ఉంటు.. పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడను..నా ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోను అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.