Begin typing your search above and press return to search.

ప్రజల కోసం ఎప్పుడూ పోరాడవా చిన్నమ్మ?

By:  Tupaki Desk   |   7 Sep 2015 9:52 AM GMT
ప్రజల కోసం ఎప్పుడూ పోరాడవా చిన్నమ్మ?
X
చిన్నమ్మ కాస్త చిత్రమైంది. తన అవసరానికి జనాల్ని ఎంతగా వాడకుంటారో.. జనాలకు మాత్రం దమ్మిడికి ఉపయోగపడరు. జనం కోసం అహరహం పోరాటం చేయటమే కాదు.. తెలుగోడి ఆత్మాభిమానం కోసం ఎన్టీవోడు ఎంతగా తపించారో తెలిసిందే. మరి.. ఆయన కడుపున పుట్టి.. అన్నగారి కూతురన్న ట్యాగ్ లైన్ తో ప్రజల మధ్యకు వచ్చి.. ఆయన మీదున్న అభిమానంతో ప్రజల మెప్పు పొంది.. రెండుసార్లు కేంద్ర సహాయమంత్రి హోదాను చేజిక్కించుకున్న పురంధేశ్వరి తనను ఎన్నుకున్న సీమాంధ్ర ప్రజలకు ఎంత చేశారో ఓపెన్ సీక్రెట్.

విభజన సమయంలో ఎంతోకొంత చేసే అవకాశం ఉన్నా.. ఏమీ చేయకుండా పదవులిచ్చిన సోనియమ్మకు విధేయతగా ఉండేందుకు సీమాంధ్రుల్ని టోకుగా అమ్మేసిన ఆమె వైఖరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకేనేమో.. తనకంటూ ఒక నియోజవర్గం లేకున్నా అప్పటివరకూ ఆదరించిన సీమాంధ్రులు.. విభజన తర్వాత ఎన్నికల్లో ఆమెను నిర్దద్వందంగా తిరస్కరించేశారు.

అప్పటికి బుద్ది రాలేదో ఏమో కానీ.. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా గురించి ఇచ్చిన హామీని వల్లెవేసిన కమలనాథులు.. పవర్ లోకి వచ్చేసిన తర్వాత తూచ్ అన్నా చిన్నమ్మ కిమ్మనటం లేదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రయోజనాలు చూసుకోవటం తప్పించి.. తనను నమ్ముకున్న ప్రజల కోసం గొంతెత్తని ఆమె తన పాత వైఖరినే మరోసారి ప్రదర్శించారు.

ప్రత్యేకహోదా కోసం జనాలు తమ ప్రాణాల్ని పణంగా పెట్టినా పెద్దగా పట్టించుకోని ఆమె.. ప్రత్యేకహోదా వచ్చే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల భావోద్వేగాలతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న ఆమె.. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేటట్లు ఇక కనిపించటం లేదని సింపుల్ గా తేల్చేస్తున్నారు. ప్రజల కోసం పోరాడాలన్న ఆలోచన మదిలో ఎప్పుడూ రాని చిన్నమ్మలాంటి వారిని నేతలుగా చేసిన పాపానికి సీమాంధ్రులు.. ఇలాంటి శిక్షలెన్ని అనుభవించాలో..?