Begin typing your search above and press return to search.

బాబుపై మోడీకి కంప్లయింట్ చేసిన పురంధేశ్వరి

By:  Tupaki Desk   |   4 April 2017 10:37 AM GMT
బాబుపై మోడీకి కంప్లయింట్ చేసిన పురంధేశ్వరి
X
ఎన్టీఆర్ కుమార్తె - మాజీ ఎంపీ - బీజేపీ నేత పురంధేశ్వరి తమ పార్టీ అధిష్ఠానానికి రాసిన లేఖ ఇప్పుడు ఏపీ టీడీపీలో హాట్ టాపిగ్గా మారింది. ముఖ్యంగా ఆమె లేఖ రాసిన నేపథ్యంలో చంద్రబాబు తెగ వర్రీ అవుతున్నారట. మంత్రివర్గంలోకి వైసీపీ నుంచి ఫిరాయించిన నేతలను తీసుకోవడంపై ఆమె బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేతలో కంగారు మొదలైనట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజాస్వామాన్ని అపహాస్యం చేసేలా రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబుపై బీజేపీ నాయకురాలు - ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. ఏపీ - తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని ఆమె ఆవేదన చెందారు. వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని మోడీ - అమిత్‌ షాల దృష్టికి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం అవహేళనకు గురవుతోందని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని కోరారు.

ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉందని, అలాంటి చోట ఇలాంటి ఫిరాయింపులు ప్రోత్సహించడం వల్ల బీజేపీకి కూడా చెడ్డపేరు వస్తోందన్నారు. చంద్రబాబు చేస్తున్న ఫిరాయింపు రాజకీయాల వల్ల బీజేపీ ఇమేజ్‌ కూడా దెబ్బతింటోందని వెంటనే నిరోధించాలని మోడీ - షాలను ఆమె కోరారు. టీడీపీ చేస్తున్న అనైతిక, జుగుప్సాకరమైన రాజకీయాల వల్ల ఆ పాపాన్ని, నిందను బీజేపీ నేతలుగా తాము కూడా మోయాల్సి వస్తోందని పురందేశ్వరి ఆవేదన చెందారు. ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతపోకడ నిలువరించకుంటే… బీజేపీ కూడా ఫిరాయింపు రాజకీయాలకు ఆమోదం తెలుపుతోందన్న భావన ప్రజల్లో కలిగే ప్రమాదం ఉందని పురందేశ్వరి తన లేఖలో రాశారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/