Begin typing your search above and press return to search.

2019 ఎన్నిక‌ల జోస్యం చెప్పేసిన పురందీశ్వ‌రి

By:  Tupaki Desk   |   25 Dec 2017 9:02 AM GMT
2019 ఎన్నిక‌ల జోస్యం చెప్పేసిన పురందీశ్వ‌రి
X
ఏపీకి ప్ర‌తిష్టాత్మ‌కం అయిన‌ప్ప‌టికీ..ఎన్నో ట్విస్టుల‌తో ఒక‌డుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కు అన్న‌ట్లుగా సాగుతున్న పోల‌వ‌రం ప్రాజెక్టు....మిత్ర‌ప‌క్షాలైన బీజేపీ-టీడీపీల మ‌ధ్య పొర‌పొచ్చాల‌ను మ‌రింత బ‌హిర్గ‌తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టు విష‌యంలో బీజేపీ నేత‌లు, కేంద్ర తీరును టీడీపీ త‌ప్పుప‌డుతుండ‌గా...ఏపీ స‌ర్కారుదే త‌ప్పంటూ తెలుగు త‌మ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా బీజేపీ ఏపీ నేత‌ల్లో కీల‌క‌మైన నేత‌గా పేరున్న ద‌గ్గుబాటి పురందీశ్వ‌రి ఇటు ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర రాజ‌కీయాల‌పై సైతం స్పందించారు.

పెనుకొండ నియోజకవర్గ బూత్ కమిటీల కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వ‌రి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధి, అంకితభావంతో సహకరిస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా ఉండదని, సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వ స‌రైన లెక్క‌లు ఇవ్వాల‌ని..పార‌ద‌ర్శ‌కంగా ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టాల‌ని పురందీశ్వ‌రి అన్నారు. ప్రత్యేక హోదా స్థానంలో అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు ఒనగూరే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి చట్టబద్ధత కల్పించామన్నారు. వెనుకబడిన రాయలసీమ - ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మూడేళ్లలో రూ.1050 కోట్లు ఇచ్చామన్నారు. పార్టీ త‌ర‌ఫున బీసీలకు అండగా నిలుస్తామన్నారు. అయితే బీసీ కమిషన్‌ కు చట్టబద్ధత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతోందని ఆరోపించారు.

ప్రసార మాధ్యమాలు రాష్ట్ర బీజేపీపై సీత కన్ను వేశాయని...కావున కార్యకర్తలే ప్రసార మాధ్యమాలుగా మారి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం చేయాలని పురందీశ్వ‌రి పిలుపునిచ్చారు. పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్రమోడీ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందిస్తున్నారన్నారు. పేదల అభ్యున్నతితోపాటు ఆత్మ గౌరవాన్ని నిలుపుతున్నామన్నారు. గతంలో ఏ ప్రధాని చేపట్టని పథకాలతోపాటు సాహసోపేతమైన నిర్ణయాలతో నీతివంతమైన పాలన అందిస్తున్న ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ముస్లిం మహిళలకు శాపంగా ఉంటున్న ట్రిపుల్ తలాఖ్ వ్య‌వ‌స్థ‌ను రూపుమార్చేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌న్నారు.

ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ పురందీశ్వ‌రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కలల ప్రపంచంలో విహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీగా పరాజయాల బాట పడుతోందన్నారు. దేశంలో 13 కోట్ల మంది సభ్యులు ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ లో 40 లక్షల సభ్యత్వాలు క‌లిగి ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటబోతోందన్నారు. బూత్ కమిటీ సభ్యులే బీజేపీ విజయసారథులని పురందీశ్వ‌రి అన్నారు.