Begin typing your search above and press return to search.

చిన్నమ్మ ఈ మధ్య పేపర్లు చదవటం లేదా?

By:  Tupaki Desk   |   1 Jun 2016 10:03 AM GMT
చిన్నమ్మ ఈ మధ్య పేపర్లు చదవటం లేదా?
X
ఓటమి అన్న డిప్రెషన్ మహమ్మారి చిన్నమ్మగా అందరి చేత పిలిపించుకునే పురంధేశ్వరిని పట్టుకొని వేలాడుతుందా? ఎంతకీ వదలటం లేదా? తాను ఏం మాట్లాడుతున్నానన్న విషయాన్ని కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా మాట్లాడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏపీ అధికారపక్షంపై దాడి చేయటమే లక్ష్యంగా పెట్టుకొన్న ఆమె.. టీడీపీ తమకు మిత్రపక్షమన్న విషయాన్ని ఆమె కనీసం గుర్తు ఉంచుకోవటం లేదన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి.

తాజాగా రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ అధికారపక్షాన్ని ఒక రాజ్యసభ సీటు తమకు కేటాయించాల్సిందిగా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా బీజేపీ చీప్ అమిత్ షా వ్యాఖ్యానించటం తెలిసిందే. వాస్తవానికి అమిత్ షా ఈ మాట చెప్పే వరకూ కూడా బీజేపీ అభ్యర్థికి టీడీపీ ఒక సీటు కేటాయించే అవకాశం లేదన్న మాటను టీడీపీ నేతలు పలువురు స్పష్టం చేశారు. ఎప్పుడైతే అమిత్ షా నోటి నుంచి రాజ్యసభ సీటు గురించి సంప్రదింపులు జరుగుతున్నాయన్న మాట వచ్చిన వెంటనే.. లెక్కలు మొత్తం మారిపోయాయి.

దీనికి భిన్నంగా తాజాగా పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సీటును ఏపీ కోటాలో సురేశ్ ప్రభుకు ఇవ్వాలని తాము కోరలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయనకు సీటు కావాలని తాము కోరామా? లేక ఆ ఆఫర్ టీడీపీ నుంచే వచ్చిందా? అన్న విషయాన్ని టీడీపీ వారినే అడిగి తెలుసుకోవాలంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించటం గమనార్హం. అమిత్ షా కోరిక మీదన సురేశ్ ప్రభుకు సీటు ఇచ్చినట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవటాన్ని ఆమె ఖండించటం విశేషం. ఓపక్క అమిత్ షా తనకు తానుగా చెప్పిన విషయాన్ని చిన్నమ్మ ఖండించటం చూస్తే.. ఈ మధ్యకాలంలో చిన్నమ్మ పేపర్లు చదవటం లేదా? అన్న డౌట్ రాక మానదు. ఈ తరహా వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ ను దెబ్బ తీస్తాయన్న విషయాన్ని పురంధేశ్వరి గుర్తిస్తే మంచిది.