Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ పై పురంధరేశ్వరి షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   26 Oct 2021 8:12 AM GMT
ఏపీ పాలిటిక్స్ పై పురంధరేశ్వరి షాకింగ్ కామెంట్స్
X
కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలు అంశాలపై రాజకీయ దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలో సీఎం జగన్, వైసీపీ నేతలను టీడీపీ నేత పట్టాభి దూషించడం, అనంతరం టీడీపీ కార్యాలయాల పై దాడుల వ్యవహారం ప్రకంపనలు రేపింది. టీడీపీ కార్యాలయాల పై దాడుల నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మరో వైపు, బద్వేలు, హుజురాబాద్ ఉప ఎన్నికల తేదీ కూడా దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ విమర్శలు గుప్పించుకోవడంలో బిజీగా ఉన్నాయి.

ఈ నేపథ్యం లో ఇరు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పరిణామాల పై బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు కోరడం, టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీని వైసీపీ కోరడం సరికాదన్నారు. రాష్ట్రాభివృద్ధి పై, ఆర్థిక స్థితి పై దృష్టి పెట్టాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీలు...ఇలా వ్యక్తిగత కక్షలతో దూషణలకు దిగడం, ఫిర్యాదులు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ, టీడీపీలు రాష్ట్రాభివృద్ధిని విస్మరించాయని ఆమె విమర్శించారు. బద్వేల్‌ లో వైసీపీకి బీజేపీ గట్టిపోటీనిస్తుందని, తమ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని పురంధరేశ్వరి అన్నారు. హుజూరాబాద్‌‌ లో బీజేపీ విజయం పై నమ్మకముందని చెప్పారు. బీజేపీ నేల విడిచి సాము చేయదని, తమ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా రాష్ట్రాభివృద్ధే తమ లక్ష్యమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలన విధించాలా లేదా అన్నది రాష్ట్రపతి పరిధిలోని అంశమని అన్నారు.