Begin typing your search above and press return to search.

రోశయ్య చిన్నమ్మకు చెప్పిందేంటి?

By:  Tupaki Desk   |   7 Sep 2016 5:18 AM GMT
రోశయ్య చిన్నమ్మకు చెప్పిందేంటి?
X
చిన్నమ్మగా సుపరిచితురాలైన దగ్గుబాటి పురంధేశ్వరి తాజాగా ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. ఒక ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె నోటి నుంచి పలు అంశాలు బయటకు వచ్చాయి. తన రాజకీయ రంగ ప్రవేశం మొదలు.. తన తండ్రి గురించి కాంగ్రెస్ సీనియర్ నేత.. ఇటీవల తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా పదవీ విరమణ చేసిన రోశయ్య చెప్పిన మాటల్ని చెప్పుకొచ్చారు.

అనూహ్య పరిస్థితుల్లో తన రాజకీయ రంగ ప్రవేశం జరిగిందని చెప్పిన ఆమె.. 2004లో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తనను బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారన్నారు. అప్పట్లో బాపట్ల ఎంపీగా దగ్గుబాటి రామానాయుడు వ్యవహరిస్తున్నారని.. ఆయనపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వీలుగా తనను ఎంపిక చేశారని.. ఆ విషయాన్ని తనకు చెప్పలేదన్నారు.

తొలుత తాను బరిలోకి దిగనున్నట్లుగా పేపర్లో లీకు ఇచ్చారని.. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భరోసా ఇవ్వటంతో కుటుంబ సభ్యులతో చర్చించి తాను పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. తన రాజకీయ రంగ ప్రవేశం అనూహ్యంగా జరిగిందన్న పురంధేశ్వరి.. తన తండ్రి గురించి కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య చెప్పిన ఒక అంశాన్ని ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. ఆ అంశాన్ని ఆమె మాటల్లోనే..

‘‘రోశయ్యగారు పలు సందర్భాల్లో నాతో చెప్పారు. నాన్న కన్నీళ్లతో తల దించుకొని అసెంబ్లీ నుంచి బయటకు వెళుతుంటే అనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మాకు కూడా కడుపు తరుక్కుపోయిందమ్మా అని అన్నారాయన. నాన్నకు అలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదు. నాన్నను అవమానించి పార్టీ నుంచి బహిష్కరించటం.. చివరకు అసెంబ్లీలో ఒక్కసారైనా మాట్లాడటానికి అవకాశం ఇవ్వమన్నప్పుడు అవకాశం ఇవ్వకపోవటం ఎంతో కలిచి వేసింది’’ అని చెప్పుకొచ్చారు.

ఇంట్లో నచ్చని పనులు చేసినప్పుడు ఎన్టీఆర్ కు ఆగ్రహం వచ్చేదని.. ఈ సందర్భంగా ఆయన తిట్లు కూడా విలక్షంగా ఉండేవని చెప్పుకొచ్చారు పురంధేశ్వరి. ఎప్పుడూ తమపై చేయి ఎత్తని ఎన్టీఆర్.. కోపం ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం.. ఏం మనకు మతులు పోతున్నాయ్ అంటూ తనను కూడా కలుపుకొని తిట్టేవారని చెప్పుకొచ్చారు. ఆ మాటే తమపై ఎంతో ప్రభావం చూపించేదని చెప్పారు చిన్నమ్మ.