Begin typing your search above and press return to search.

టీడీపీ కోటాలో రాజ్యసభకు పురంధేశ్వరి?

By:  Tupaki Desk   |   15 Jan 2016 5:20 AM GMT
టీడీపీ కోటాలో రాజ్యసభకు పురంధేశ్వరి?
X
చంద్రబాబుకు పక్కలో బల్లెంలా ఉండే మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రూటు మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. మాట్లాడితే చంద్రబాబుపై విరుచుకుపడే ఆమె కొద్దికాలంగా మౌనంగా ఉంటున్నారు. అంతేకాదు... రెండు మూడు నెలల కిందట వరకు కూడా ఆమె చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. ఏపీలోని మిగతా బీజేపీ నేతలతో కలిసి చంద్రబాబు పాలనను, ఆయన్ను విమర్శించేవారు. అయితే కొద్దికాలం కిందట ఆమె సడెన్ గా టోన్ మార్చారు. చంద్రబాబుపై విమర్శలు తగ్గించారు. అంతేకాదు.... అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం సందర్భంలోనూ ఆమె చంద్రబాబును, టీడీపీని సమర్థించారు. అంతేకాదు... పాలన విషయంలోనూ ముఖ్యమంత్రికి కొంత టైం ఇవ్వకుండా విమర్శలకు దిగడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తంచేశారు. ఇదంతా చూసిన పరిశీలకుడు ఆమె తన సోదరుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభ సీటుకోసం చంద్రబాబుతో రాయబారానికి వీలుగా ప్లాట్ ఫాం రెడీ చేస్తున్నారని భావించారు. కానీ.... అసలు సంగతి వేరని తెలుస్తోంది. ఆమె ఏకంగా తన రాజ్యసభ సీటు కోసం టీడీపీని ఆశ్రయించాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది.

తొలుత ఆమె బీజేపీలో అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే... అది కాపులకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో రాజ్యసభకు వెళ్తే భవిష్యత్తులో కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కే ఛాన్సుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన మహిళా నేతలు లేరు. ఏపీలో అయితే.... పురంధేశ్వరి తప్ప ఎవరూ కనిపించడం లేదు... ఆ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యత్వంతో ఎంపీ అయితే ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ తనకు మంత్రి పదవి ఇస్తుందని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాతకక్షలు వదిలేసి చంద్రబాబును ఆశ్రయిస్తే ఫలితం ఉండొచ్చని ఆమె అనుకుంటున్నారు. అవసరమైతే తమ్ముడు బాలయ్య కూడా తన తరఫున చంద్రబాబుకు ఒక మాట చెప్పి రాజ్యసభ సీటు ఇప్పిస్తారన్నది ఆమె ఆశ.

తెలుగుదేశం కోటాలో ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్ రాజ్యసభ పదవీకాలం ముగిస్తే ఆమె స్థానంలో వెళ్లాలన్నది చిన్నమ్మ ప్లానుగా తెలుస్తోంది. బీజేపీ మహిళ ప్లేసులో బీజేపీ మహిళకే స్థానం ఇచ్చినట్లు అవుతుందన్న వాదనతో నిర్మలా సీతారామన్ ప్లేసును ఆమె కోరబోతున్నట్లు సమాచారం. చిన్నమ్మ ఆశలు వినడానికి బాగానే ఉన్నా చంద్రబాబు ఎంతవరకు తీరుస్తారన్నదే ప్రశ్నార్థకం.