Begin typing your search above and press return to search.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు.. హైకోర్టు తాజా తీర్పు ఇదే!

By:  Tupaki Desk   |   4 Nov 2022 1:30 PM GMT
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు.. హైకోర్టు తాజా తీర్పు ఇదే!
X
టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది.

మొయినాబాద్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఈ కేసు దర్యాప్తుపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించిన సంగతి విదితమే. అయితే నిందితులను పోలీసుల కస్టడీకి అప్పగించాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరారు. నిందితులు ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎలా కుట్ర పన్నారు? డబ్బు ఏ విధంగా సేకరించారనే విషయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. నిందితుల కస్టడీకి పోలీసులు పిటిషన్‌ దాఖలు చేసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ కేసు విచారణపై ఇప్పటికే స్టే ఇచ్చామని.. అది నవంబర్‌ 7 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

కాగా ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్‌ రెడ్డి గతంలోనే వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌ సుదీర్ఘంగా ఉన్నందున తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని ప్రేమేందర్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

మరోవైపు ఈ కేసులో మీడియా సహా ఎవరూ ఎలాంటి వీడియో, ఆడియోలు విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలంటూ నిందితుల్లో ఒకరైన నందు భార్య చిత్రలేఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో సాగుతున్న ఈ దర్యాప్తుపై విశ్వాసంలేదని ఆమె పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థతో సిట్టింగ్‌ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరిపేలా ఆదేశాలివ్వాలంటూ ఆమె నవంబర్‌ 3న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అలాగే తీన్మార్‌ మల్లన సైతం ఒక ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

కాగా బెయిల్‌ కోసం నిందితులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్‌ 7కి వాయిదా పడింది. నిందితులకు ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేసుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. తాము చేసే విచారణ ట్రయల్‌ కోర్టుపై ప్రభావం చూపదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.