Begin typing your search above and press return to search.

ఒక్కరోజులో 1.05కోట్ల మంది స్నానాలు

By:  Tupaki Desk   |   19 July 2015 4:29 AM GMT
ఒక్కరోజులో 1.05కోట్ల మంది స్నానాలు
X
గోదావరి పుష్కరాలలో మరో అరుదైన రికార్డు నమోదైంది. వరుస సెలవులతో పాటు.. మహా పుష్కరాలకు సమయం మించిపోతుందన్న అత్రుత.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని గోదారమ్మ దగ్గరకు వెళ్లేలా చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాల కోసం పయనమైన ప్రజలు శనివారం.. ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే. రోడ్డు మీద నరకం అంటే ఏమిటో చవి చూసిన ప్రజలు ఇంతగా ఇబ్బంది పడటానికి కారణం ఏమిటి? ఎందుకింత ఇబ్బంది? అన్న ప్రశ్నలు వేస్తే.. జన సందోహమే అని చెప్పాలి. కేవలం ఒక్కరోజు వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో (తెలంగాణలో 5.. ఏపీలో 2) గోదావరి పుష్కరాల్లోస్నానం చేసిన వారి సంఖ్య 1.05కోట్ల మంది కావటం గమనార్హం.

శనివారం ఒక్కరోజులో.. ఏపీలో 65లక్షల మంది.. తెలంగాణలో 40లక్షల మంది గోదావరి స్నానాలు చేసినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వీరు కాకుండా లక్షల్లో స్నానాలు చేసేందుకు రోడ్ల మీద ఉన్నట్లు చెబుతున్నారు. ఇంత భారీగా ప్రజలు గోదావరి పుష్కర స్నానం కోసం రోడ్ల మీదకు రావటంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కలు కనిపించిన పరిస్థితి.

ఎంతకూ తరగని వాహన ప్రవాహంతోపాటు.. జనసమ్మర్థాన్ని కంట్రోల్ చేయలేక అధికారులు చేతులు ఎత్తేసే పరిస్థితి. గోదావరి తీరాల్లో భక్త విస్పోటనంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రహదారులన్నీ వాహనాలతో నిండిపోయిన పరిస్థితి. ఇంత భారీగా భక్తులు ఒకే రోజులో పుష్కర స్నానం చేయటం ఒక రికార్డుగా చెబుతున్నారు.