Begin typing your search above and press return to search.

1956లోనే 20 లక్షల మందట

By:  Tupaki Desk   |   20 July 2015 1:56 PM GMT
1956లోనే 20 లక్షల మందట
X
పుష్కర స్నానాలకు పెద్ద ఎత్తున జనాలు వెళుతుంటే.. ప్రజల్లో ఇప్పుడే భక్తి పెరిగిపోయిందని.. పాపం పెరిగి భక్తి ఎక్కువైందనే ప్రచారం ఇప్పుడు ఎక్కవైంది. దీనికితోడు ఇప్పుడు ప్రవచన కారులు ఎక్కువయ్యారని, వారి ప్రభావం కూడా గోదావరి పుష్కరాలకు జనాలు పోటెత్తడానికి కారణమనే విమర్శలూ చేస్తున్నారు. కానీ, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. 1956లోనే గోదావరి పుష్కరాల్లో 20 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారట. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే దాదాపు మూడు కోట్ల మంది స్నానాలు చేశారని అంచనా.

వాస్తవానికి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ బోల్డన్ని ఘాట్లు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా 252 ఘాట్లు ఉన్నాయి. ఇవికాక అనధికార ఘాట్లు బోల్డన్ని. ఇక తెలంగాణలో అయితే బాసర నుంచి భద్రాచలం వరకు బోల్డన్ని ఘాట్లు. కానీ 1956లో ఇన్ని ఘాట్లు లేవు. అప్పట్లో పుష్కరాలు అంటే ఒక్క రాజమహేంద్రవరమే. భద్రాచలం వంటి క్షేత్రాలు కూడా అప్పట్లో పెద్దగా ప్రాచుర్యంలో లేనివే. దాంతో అప్పట్లో పుష్కరాలు అంటే ప్రతి ఒక్కరూ రాజమండ్రి వెళ్లేవారు. అటువంటి రాజమండ్రికే అప్పట్లో గోదావరి పుష్కరాలకు 20 లక్షల మంది వచ్చారని 1956 జూన్ నెలలో వెలువడిన ఆంధ్ర వార పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ఇంత జనాభా పెరిగిన తర్వాత ఐదు కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కరాలకు వెళ్లడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది?