Begin typing your search above and press return to search.

రాజమండ్రికి కార్ల సునామీ

By:  Tupaki Desk   |   18 July 2015 9:55 AM GMT
రాజమండ్రికి కార్ల సునామీ
X
పుష్కరాలకు ఎన్ని లక్షల మంది భక్తులొచ్చారు..? మొత్తం ఎంతమంది వస్తారు...? పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రశ్న.. దీనికి తోచినట్లు సమాధానాలు వినిపిస్తున్నాయి. కానీ.. శనివారం మాత్రం రాజమండ్రిలో కొత్త ప్రశ్న వినిపించింది. ఆ ప్రశ్న ఏంటంటే... ''ఎన్ని వాహనాలు వచ్చుంటాయి...?'' ఎవరి నోట విన్నా ఇదే మాట.. శనివారం రాజమండ్రికి వాహనాల వరద రావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ. మీడియా, ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం మధ్యాహ్నం సరికి సుమారు లక్ష వాహనాలు వచ్చాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మార్గంలో ఇంకా వాహనాల ప్రవాహం తగ్గకపోవడంతో సాయంత్రం సరికి ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుతుందని భావిస్తున్నారు.

రాజమండ్రి వాహనాలతో నిండిపోవడంతో అధికార యంత్రాంగం చేతులెత్తేస్తోంది. శని, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా పుష్కర జనం పెరిగిపోయారు. దీంతో అన్ని దారులు గోదావరి తీరానికే దారితీసాయి. రాజమండ్రి భక్తులతో పాటు వాహనాలతో పోటెత్తింది. ఎక్కడ చూసినా గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్‌ కన్పించింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ఐదో రోజుకు చేరుకున్నాయి. శనివారం రంజాన్‌, ఆదివారం సెలవులు కావడంతో ఇప్పటి వరకు పుష్కర స్నానం చేయని వారంతా గోదావరి వైపు దారి తీసారు.

శనివారం తెల్లవారుఝామున మూడు గంటల నుంచి పుష్కర స్నానాలకు భక్తులు పయనమవడంతో ఉదయం 6 గంటల ప్రాంతానికి రాజమండ్రి వైపు వెళ్ళే అన్ని రహదారులు వేలాది వాహనాలతో నిండిపోయాయి. లాలాచెరువు, దివాన్‌ చెరువు, రాజానగరం, బొమ్మూరు, ధవళెశ్వరం, జగ్గంపేట జాతీయ రహదారి ఇలా అన్ని దారులూ వాహనాలతో మూసుకుపోయాయి. నగరంలోకి ప్రవేశించే ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు ఆపి పార్కింగ్‌ ప్రదేశాలకు తరలించేందుకు పుష్కరాల ప్రారంభంకు ముందు అధికారులు ఏర్పాటు చేసారు. అయితే ఈ పార్కింగ్‌ ప్రాంతాలకు చేరుకోవడానికే గంటల తరబడి సమయం పడుతోంది. ఇన్ని వాహనాలను ఎపుడూ చూడలేదని రవాణాశాఖ అధికారులే చెపుతున్నారు. ఒక్క శనివారమే ఇప్పటివరకు లక్ష వాహనాలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.