Begin typing your search above and press return to search.

మళ్లీ కోటి మార్క్ దాటిన పుష్కర స్నానం

By:  Tupaki Desk   |   23 July 2015 4:54 AM GMT
మళ్లీ కోటి మార్క్ దాటిన పుష్కర స్నానం
X
వారాంతంలో పోటెత్తిన గోదావరి పుష్కర స్నానం.. సోమవారం ఊపు కాస్త తగ్గితే.. మంగళవారం జనం కాస్తంత పల్చగా కనిపించిన పరిస్థితి. కానీ.. బుధవారం మళ్లీ పుష్కర స్నానం జోరందుకుంది. పుష్కరాలు ముగిసేందుకు మరో మూడు రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో.. భక్తులు పుష్కర స్నానం చేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కర స్నానాలు జోరందుకున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో గోదావరి నదీ తీరాలకు ప్రయాణం కట్టటంతో రహదారులు వాహనాలతో నిండిపోయాయి. పలుచోట్ల ట్రాఫిక్ జాంలు చోటు చేసుకున్న పరిస్థితి. తెలంగాణలో ధర్మపురిలో భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని మొత్తం ఐదు జిల్లాల్లోని ఘాట్లలో ధర్మపురి ఘాట్ లో అత్యధికంగా పుష్కర స్నానాలు చేశారు.

సోమ.. మంగళవారాల్లో కోటి అంకెకు తక్కువగా జరిగిన పుష్కర స్నానం.. మళ్లీ ఊపందుకోవటంతో బుధవారం రెండు తెలుగురాష్ట్రాల్లో పుష్కర స్నానం ఆచరించిన వారి సంఖ్య కోటి మార్క్ దాటింది.

పుష్కరాలు మొదలైన తర్వాత.. ఏపీ కంటే ఎక్కువగా తెలంగాణలో పుష్కర స్నానాలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అదే జోరు బుధవారం కొనసాగింది. తెలంగాణలో బుధవారం ఒక్కరోజులోనే 60 లక్షలకు పైగా పుణ్య స్నానాలు ఆచరించగా.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 40 లక్షల మంది పుష్కర స్నానం చేశారు.

ఈ నెల 25తో గోదావరి పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో.. గురు.. శుక్ర..శనివారాల్లో భక్తుల రద్దీ మరింత జోరందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరి.. భక్త జన సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.