Begin typing your search above and press return to search.

కోడ‌లిపై పోటీకి మామ సై!

By:  Tupaki Desk   |   13 Sep 2021 12:11 PM GMT
కోడ‌లిపై పోటీకి మామ సై!
X
కుటుంబంలో అంద‌రు క‌లిసి ఆప్యాయంగా ఉన్న‌ప్ప‌టికీ ఒక్క‌సారి రాజ‌కీయాల్లో అడుగుపెట్టారంటే ఆ ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుంది. ఇక ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు వేర్వేరు పార్టీల్లో ఉంటూ ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డాల్సి వ‌స్తే వాళ్ల మ‌ధ్య రాజ‌కీయ వైరం మ‌రోస్థాయికి చేరుతుంది. గ‌తంలో చాలా సార్లు ఇలాంటి సంఘ‌ట‌నలు క‌నిపించాయి. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఒకే కుటుంబానికి చెందిన నాయ‌కులు వేర్వేరు పార్టీల త‌ర‌పున పోటీ చేసి త‌మ అదృష్టం ప‌రీక్షించుకున్నారు. విశాఖ జిల్లా మాడుగుల నుంచి టీడీపీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే గ‌విరెడ్డి రామానాయుడు జ‌న‌సేన నుంచి ఆయ‌న సోద‌రుడు స‌న్యాసి నాయుడు పోటీ చేశారు. కానీ ఆ ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అక్క‌డ వైసీపీ నుంచి ముత్యాల నాయుడు గెలిచారు.

కాగా ఇప్పుడు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న టీడీపీ వైసీపీ నుంచి మామ కోడ‌లు మ‌ధ్య పోటీ నెల‌కొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న పాములు పుష్ఫ శ్రీ వాణి.. ఆమె మామ మాజీ ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రాజు మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర పోరు సాగే ఛాన్స్ ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. కురుపాం నుంచి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పుష్ప భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత ఆమెకు జ‌గ‌న్ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అయితే ఆమె కుటుంబంలో ముందు నుంచే రాజ‌కీయ విభేధాలు కొన‌సాగుతున్న‌య‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆమెపై మామ చంద్ర‌శేఖ‌ర్ రాజు బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

అప్పుడు మామా కోడ‌లు ఒకే పార్టీలో కొన‌సాగారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక సొంత పార్టీ నేత‌ల‌కు కూడా ప‌నులు కావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌శేఖ‌ర్ టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున నాగూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్ర‌శేఖ‌ర్ మాజీ మంత్రి శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజుకు స్వ‌యానా సోద‌రుడు. ఇప్పుడు చంద్రేశేఖ‌ర్కు టీడీపీలో ప్రాధాన్యం ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. కురుపాం నియోజ‌క‌వ‌ర్గం నుంచే కోడిలిపై మామ‌ను పోటీకి నిల‌బెడ‌తార‌ని స‌మాచారం.

గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ కురుపాంలో టీడీపీ నుంచి పోటీ చేసిన త‌ల్లీ కొడుకులు న‌ర‌సింహా ప్రియ జ‌నార్ధ‌న్ మ‌ర‌ణించారు. దీంతో ఇప్పుడు కురుపాంలో టీడీపీకి స‌రైన నాయ‌కుడు లేరు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ గిరిజ‌నుల్లో ప‌ట్టున్న చంద్ర‌శేఖ‌ర్ రాజు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుష్ఫ‌ను దెబ్బ‌కొట్టాలంటే ఆమె మామ చంద్ర‌శేఖ‌ర్‌నే పోటీలో దింపాల‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీనిపై బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.