Begin typing your search above and press return to search.

వెంకన్నకు పువ్వులు లేకుండా చేసిన వరుణుడు

By:  Tupaki Desk   |   17 Nov 2015 6:17 AM GMT
వెంకన్నకు పువ్వులు లేకుండా చేసిన వరుణుడు
X
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవం అయిన తిరుమల వెంకన్ననే వర్షం ఇబ్బంది పెడుతోంది. తిరుమల వెంకటేశ్వరస్వామికి నిర్వహించబోయే పుష్పయాగానికే ఆటంకం ఏర్పడుతోంది. సాధారణంగా ఈ పుష్పయాగానికి అవసరమైన పువ్వులు కంటే ఏటా అధిక సంఖ్యలోనే పువ్వులు సమకూరుతాయి. చెన్నై - బెంగళూరు - ఏపీ నుంచి దాతలు పెద్ద మొత్తంలో పువ్వులు పంపిస్తారు. టన్నుల కొద్దీ పువ్వులతో పుష్పయాగం అద్భుతంగా నిర్వహిస్తారు. కానీ, ఈసారి మాత్రం సరిపడినన్ని పువ్వులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. చెన్నైలో భారీ వర్షాలతో ఆ నగరం జలమయం కావడం... ఏపీలోనూ చిత్తూరు - నెల్లూరు - రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో దాతలు చేతులెత్తేశారు. తాము పువ్వులు సేకరించలేమని... ఒకవేళ ఎక్కడైనా దొరికినా వాటిని పంపించడం కూడా సాధ్యం కాదని చెన్నైకి చెందిన దాతలంతా తితిదేకు సమాచారం ఇచ్చారట. దీంతో టీటీడీ హార్టికల్చర్ డిపార్టుమెంటు ఇప్పుడు నానా తిప్పలు పడుతోంది. ప్రతి సంవత్సరం వద్దంటే టన్నుల కొద్దీ పేరుకుపోయే పువ్వులు ఈసారి కొంచెం కూడా దొరక్కపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

మరోవైపు వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. సోమవారం కేవలం 42 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్ల డించాయి. సాధారణంగా కార్తీక మాసం ఆరంభం నుంచి మాసం చివరి వరకు భక్తుల రద్దీ తిరుమలలో అధికంగా ఉంటుంది. రోజుకు లక్ష కంటే ఎక్కువ మంది దర్శించుకుంటారు. కానీ, వర్షాల కారణంగా భక్తులు రావడం లేదు. రైళ్లు పదేసి గంటల ఆలస్యమవుతుండడంతో తిరుమలకు జనం తగ్గారు. మంగళవారం అయితే మరీ బోసిపోయింది. మంగళవారం 25 వేల మందికి మించి భక్తులు రాకపోవచ్చని భావిస్తున్నారు.