Begin typing your search above and press return to search.

తెలుగుదేశం.. మరో అభ్యర్తి చేతులెత్తేశాడా..?

By:  Tupaki Desk   |   21 March 2019 5:06 AM GMT
తెలుగుదేశం.. మరో అభ్యర్తి చేతులెత్తేశాడా..?
X
మొన్న రఘురామకృష్ణం రాజు - ఆ తర్వాత బుడ్డా రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు మరో అభ్యర్థి.. చేతులు ఎత్తేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాకా ఒక్కోరు తమకు టికెట్ వద్దని - తాము పోటీలో ఉండాలని అనుకోవడం లేదంటూ సదరు నేతలు ప్రకటనలు చేస్తూ బాబుకు షాక్ ఇస్తూ ఉన్నారు. నరసాపురం ఎంపీ టికెట్ ను రఘురామకృష్ణం రాజుకు కేటాయించారు చంద్రబాబు నాయుడు. ప్రచారం కూడా చేసుకొమ్మన్నారు. అయితే ఆయన జగన్ ను కలిశారు.

టీడీపీ టికెట్ వద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీశైలం ఎమ్మెల్యే సీటు అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి కథ కూడా అదే. టికెట్ ఖరారు అయిన తర్వాత బుడ్డా చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత ఏదో బుజ్జగించి ఆయననే పోటీ చేయిస్తున్నారట.

ఈ పరంపరలో మరో నేత ఇదే జాబితాలోకి చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తెర్లాం పూర్ణం తను పోటీ చేయడం లేదని అంటున్నారట. ఈయనకు టికెట్ ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి రెండ్రోజుల కిందట ప్రకటన వచ్చింది. ఇక నామినేషనే తరువాయి అనుకుంటుంటే.. ఈ దశలో తను పోటీ చేయాలని అనుకోవడం లేదని ఈయన ప్రకటించారని సమాచారం.

ఈయన అందుబాటులో కూడా లేకుండా పోయారట. ఇన్ని రోజులూ టికెట్ కావాలని - చివరకు టికెట్ దక్కాక ఇలా చేస్తుండే సరికి తెలుగుదేశం పార్టీలో రచ్చ రేగుతూ ఉందట. ఐవీఆర్ ఎస్ పద్ధతిలో సర్వే చేసి సైతం చంద్రబాబు నాయుడు ఈయనకు టికెట్ ను కేటాయించారట. వేరే వాళ్లు ఈ టికెట్ ను కోరినా.. బాబు ఈయననే ఎంపిక చేశారట. తీరా చంద్రబాబు నాయుడు ఏరికోరి ఎంపిక చేసిన అభ్యర్థి ఇలా అందుబాటులో లేకుండా పోవడం విశేషమే!