Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ వార్ పై పుతిన్ సలహాదారుడి సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   17 Dec 2022 8:30 AM GMT
రష్యా-ఉక్రెయిన్ వార్ పై పుతిన్ సలహాదారుడి సంచలన వ్యాఖ్యలు..!
X
రష్యా-ఉక్రెయిన్ వార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కాగా నేటికీ కొనసాగుతూనే ఉంది. గత పది నెలలుగా యుద్ధం నిరాటకంగా కొనసాగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఎక్కడ అంతర్జాతీయ యుద్ధానికి దారి తీస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తొలుత ఐరాస గట్టి ప్రయత్నాలు చేసింది. అయితే రష్యా దూకుడుగా వెళ్లడంతో యుద్ధం అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ మద్దతుగా అమెరికా సహా నాటో దళాలు నేరుగా యుద్ధంలోకి దిగేందుకు యత్నించాయి. అయితే అమెరికా యుద్దంలోకి దిగితే రష్యాకు మద్దతుగా మరికొన్ని దేశాలు అండగా నిలిచే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే అమెరికా.. నాటో దళాలు యుద్ధంలోకి దిగకుండా అన్ని దేశాలు ఐక్యంగా కట్టడి చేశారు. దీంతో యుద్ధం రష్యా-ఉక్రెయిన్ మధ్యే ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది. ప్రస్తుత శీతాకాల సీజన్లో యుద్దం ఇరుదేశాలకు కత్తి మీద సాములా మారింది. సైనికులు ఓవైపు చలిపులితో ప్రాణాలను కాపాడుకుంటూనే మరోవైపు యద్ధం సాగించాల్సి వస్తోంది.

ఈ కాలంలో ఆహారం.. ఇంధనం అనేది ఎక్కువగా సైనికులకు.. పౌరులకు అవసరం పడుతుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ చమురు కేంద్రాలు.. ఆహార వ్యవస్థపై రష్యా మూకుమ్మడి దాడి చేస్తుంది. ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇరుదేశాల సైనికులు వేలాది అమరులవుతున్నారు. ఇరుదేశాల అధ్యక్షులు ఎవరికి వారు యుద్ధంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీంతోవేలాది మంది పౌరులు.. లక్షలాది మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పుతిన్.. జెలన్ స్కీ ఇద్దరు కూడా యుద్ధాన్ని ఆత్మగౌరవ.. దేశ రక్షణ సమస్యగా భావిస్తుండటంతో ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య వార్ ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని అంతర్జాతీయ మీడియా సైతం వెల్లడిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలు ఆందోళనకు గురయ్యేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహాదారుడు అలెగ్జాండర్ డుగిన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ వార్ ముగియాలంటే రెండు దారులున్నాయని తెలిపారు. ఒకటి ఈ యుద్ధంలో మాస్కో విజయం సాధించడం ద్వారా యుద్ధం ముగుస్తుందని తెలిపారు.

రెండోది ప్రపంచ సర్వనాశనం అవడం ద్వారా వార్ ముగిసే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం యుద్ధం ఏక ధ్రువ ప్రపంచానికి వ్యతిరేకంగా.. బహుళ ధ్రువ ప్రపంచం దిశగా సాగుతోందన్నారు. ఈ యుద్ధం రష్యా.. ఉక్రెయిన్.. ఐరోపాల కోసమో.. పశ్చిమ దేశాల వ్యతిరేకంగానో కాదన్నారు.

ఆధిపత్యానికి వ్యతిరేకమైన మానవత్వం కోసమని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై అణ్వస్త్ర దాడి చేయబోతుందని అంతర్జాతీయ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే పుతిన్ సలహాదారుడు యుద్ధం ముగింపుపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై గెలువడం అంత ఈజీగా కన్పించడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.