Begin typing your search above and press return to search.

భార‌త్ తీవ్ర ఆందోళ‌న రీజ‌న్ ఇదే.. అణ్వాయుధ దాడి దిశ‌గా.. పుతిన్ అడుగులు!

By:  Tupaki Desk   |   1 March 2022 2:30 PM GMT
భార‌త్ తీవ్ర ఆందోళ‌న రీజ‌న్ ఇదే.. అణ్వాయుధ దాడి దిశ‌గా.. పుతిన్ అడుగులు!
X
అణ్వాయుధాల వినియోగానికి సిద్ధంగా ఉండాలంటూ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన ఆదేశాల నేప‌థ్యం లో ఉక్రెయిన్‌పై ఆయ‌న అణ్వ‌స్త్రాల‌ను ప్ర‌యోగించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ త‌న విద్యార్థుల‌ను వెన‌క్కి తెప్పించేందుకు ఉరుకులు ప‌రుగులు పెడుతోంది.

ఓ వైపు ఉక్రెయిన్తో చర్చలు జరుపుతూనే ఆ దేశంపై దాడులు కొనసాగిస్తోంది రష్యా. రాజధాని కీవ్వైపు రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్ ను ఉపగ్రహ చిత్రాలు గుర్తించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నగరాల్లో ఈ ఉదయం నుంచి ఎయిర్‌ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్‌తోపాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్‌, రివ్నే తదితర ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు.

కీవ్- ఖార్కివ్ మధ్య ఉన్న ఒఖ్తిర్కా మిలిటరీ బేస్పై రష్యన్ బలగాలు జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనికాధికారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు. ఇరు దేశాల బలగాల మధ్య ఆదివారం జరిగిన పోరులో ఎంతో మంది రష్యన్ సైనికులు సహా స్థానికులు కూడా మృతి చెందినట్లు తెలిపారు.

తొలుత ఉక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోని పలు నివాస ప్రాంతాలపై రష్యా బాంబులు విసిరింది. గత గరువారం నుంచి రష్యా దాడుల్లో 352 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది.

వీరిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు సాయం అందించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. 50 మిలియన్ డాలర్లు విలువ చేసే ఆయుధాలను ఉక్రెయిన్కు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వెల్లడించారు.

రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే వివిధ ఆంక్షలను విధించాయి. తాజాగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐరాసలో రష్యాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి వాసిలీ నెబెన్జియా వెల్లడించారు.అంతేకాదు.. ఇటు క్రీడా రంగానికి సంబంధించి కూడా రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది.

వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్ఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులను రద్దు చేసింది. త్వరలో చర్చల ద్వారా మరో వేదికను నిర్ణయించనున్నట్లు ఐఐహెచ్ఎఫ్ స్పష్టం చేసింది. దీంతో పాటు.. తమ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో రష్యా, బెలారస్ దేశాలకు చెందిన జట్లు, క్లబ్లు పాల్గొనడంపై ఐఐహెచ్ఎఫ్ నిషేధం విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.