Begin typing your search above and press return to search.

అన్నంతపనీ చేసి చూపించిన పుతిన్

By:  Tupaki Desk   |   28 April 2022 8:30 AM GMT
అన్నంతపనీ చేసి చూపించిన పుతిన్
X
రష్యా అధ్యక్షుడు ఏదో హెచ్చరికలు చేస్తున్నారని అనుకున్నారు కానీ అన్నంతపనీ చేస్తారని అనుకోలేదు. చెప్పింది చేసి చూపించేటప్పటికి రష్యా నుండి గ్యాస్ అందుకుంటున్న దేశాలు ఇపుడు షాక్ తిన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే నాటో దేశాలతో పాటు యూరోపులోని చాలా దేశాలు అవసరమైన గ్యాస్ రష్యా నుండే కొనుగోలు చేస్తున్నాయి. ఏ కారణం వల్ల గ్యాస్ సరఫరా ఆగిపోయినా చాలా దేశాల పరిస్ధితి అంతే సంగతులు.

ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైంది. దాంతో రష్యాపై అమెరికా నాయకత్వంలోని చాలా దేశాలు ఆర్ధికపరమైన ఆంక్షలు విధించాయి. వీటిల్లో రష్యా నుండి గ్యాస్ కొంటున్న దేశాలు కూడా ఉన్నాయి.

తమ మీద ఆంక్షలు విధించినందుకు ప్రతీకారంగా గ్యాస్ కొనుగోలుకు ఇక నుండి రష్యా కరెన్సీ రూబుల్స్ లో చెల్లిస్తేనే గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటించారు. పుతిన్ ప్రకటనను చాలా దేశాలు తేలిగ్గా తీసుకున్నాయి.

అయితే గ్యాస్ కొనుగోలు అవసరమైన పోలండ్, బల్గేరియాలను రూబుల్స్ లో పేమెంట్ చేయాలని రష్యా చెప్పింది. అయితే డాలర్లలో మాత్రమే పేమెంట్ చేస్తామని చెప్పటంతో పై రెండు దేశాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ఈ దేశాల్లో గగ్గోలు మొదలైపోయింది. వీటిని చూసి మిగిలిన దేశాల్లో కూడా టెన్షన్ మొదలైపోయింది. ఎలా సంపాదించిందో తెలీదుకానీ గ్యాస్ కొనుగోలుకు హంగరీ మాత్రం రూబుల్స్ లోనే పేమెంట్ చేసేసింది.

హంగరీ చేసిన పనికి మిగిలిన దేశాల్లో అయోమయం పెరిగిపోతోంది. ఎందుకంటే వందల కోట్ల విలువైన రూబుల్స్ ఎక్కడినుండి తేవాలో చాలా దేశాలకు అర్ధం కావటం లేదు. యూరోపులోని చాలా దేశాల్లో జనాలకు గ్యాస్ లేనిదే రోజు గడవదు.

కారు, వాహనాలు, వంటలు, బాత్రూములు, బెడ్ రూముల్లో గీజర్లు ఇలా ఏది తీసుకున్నా గ్యాస్ ఉండాల్సిందే. అలాంటిది రష్యా నుండి గ్యాస్ సరఫరా ఆగిపోతే ప్రజల రోజువారీ కార్యక్రమాలంతా తల్లకిందులైపోతుంది. ఈ ధైర్యంతోనే రష్యా రూబుల్స్ లో చెల్లింపులు చేస్తేనే గ్యాస్ ఇస్తామని తెగేసి చెప్పింది. మరి గ్యాస్ అవసరమైన దేశాలు ఏమి చేస్తాయో చూడాల్సిందే.