Begin typing your search above and press return to search.

పుట్టా తొండివాద‌న‌..టీటీడీ నుంచి త‌ప్పుకోర‌ట‌

By:  Tupaki Desk   |   28 May 2019 8:20 AM GMT
పుట్టా తొండివాద‌న‌..టీటీడీ నుంచి త‌ప్పుకోర‌ట‌
X
టీడీపీ నేత‌, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి చైర్మ‌న్ ను ప‌ద‌వికి రాజీనామా చేసిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఇప్పుడు నిజంగానే తొండి వాద‌న‌కు దిగార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ఇటీవ‌లే ముగిసిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ఆయ‌న పోటీ చేశారు. 2014లో త‌న‌ను ఓడించిన వైసీపీ నేత రాఘురామిరెడ్డి చేతిలోనే ఈ సారి కూడా ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. ఇప్పుడంటే ఓడిపోయారు గానీ... మొన్న‌టిదాకా ఫ‌లితాల కోసం ఏకంగా నెల‌న్న‌ర పాటు వేచి చూశారు క‌దా. అయినా నామినేష‌న్ కు ముందు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికి పుట్టా రాజీనామా చేయ‌డం - దానికి ఆమోద ముద్ర ప‌డిపోవ‌డం జ‌రిగిపోయింది క‌దా. అంటే.... ఏ కోణాన చూసినా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ టీటీడీ మాజీ చైర్మ‌న్ కిందే లెక్క‌.

మ‌రి ఈ విష‌యాన్ని జ‌నం ఏం గుర్తుంచుకుంటారులే అనుకున్నారో, ఏమో... ఎలాగూ తాను ఎమ్మెల్యేగా గెల‌వ‌లేదు క‌దా. త‌న‌కు ద‌క్కిన టీటీడీ చైర్మ‌న్ పోస్టులో కొన‌సాగుతాను అంటూ పుట్టా నేటి ఉద‌యం తిర‌మ‌ల వెంక‌న్న సాక్షిగా నానా ర‌చ్చ చేశారు. టీడీపీ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగినా కూడా... టీటీడీ చైర్మ‌న్ హోదాలో తాను పాల‌క మండ‌లి స‌మావేశం నిర్వ‌హిస్తానంటూ పుట్టా నిన్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ప్ర‌క‌ట‌న మేర‌కే ఆయ‌న నేడు స‌మావేశానికి త‌ర‌లివెళ్లారు. నిర్ణీత వేళ‌కంటే ముందుగానే స‌మావేశ మందిరానికి చేరుకున్న పుట్టా... చైర్మ‌న్ సీట్లో ఆసీనులైపోయారు. ఆ త‌ర్వాత స‌భ్యులు, అధికారులు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో స‌మావేశ మందిరంలో పెద్ద ర‌చ్చే జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసినా... పాల‌క వ‌ర్గం స‌మావేశాన్ని ఎలా నిర్వ‌హిస్తారంటూ అధికారులు ఆయ‌న‌ను ప్ర‌శ్నించిన‌ట్టుగా స‌మాచారం. అయితే తాను టీడీపీ నియ‌మించిన వ్య‌క్తిని కాద‌ని, ఏపీ ప్ర‌భుత్వం నియ‌మిస్తే... ప‌ద‌విని చేప‌ట్టాన‌ని పుట్టా తొండి వాద‌న‌కు దిగార‌ట‌.

స‌రే... ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌ద‌వే అనుకున్నా... ఎన్నిక‌ల ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఆ ప‌దవికి రాజీనామా చేశారు క‌దా అని కూడా అధికారులు గుర్తు చేశార‌ట‌. ఎమ్మెల్యేగా గెల‌వ‌లేదు క‌దా... చైర్మ‌న్ ప‌ద‌వికి చేసిన రాజీనామా చెల్ల‌దు క‌దా అంటూ మ‌రో కొత్త వాద‌న చేశారట‌. మొత్తంగా పుట్టా వ‌ర్సెస్ అధికారుల వాద‌న‌తో అక్క‌డ పెద్ద ర‌చ్చే జ‌రిగింద‌ని స‌మాచారం. ఎంత చెప్పినా పుట్టా విన‌క‌పోవ‌డంతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈఓ శ్రీ‌నివాస‌రాజు - ఇత‌ర అధికారులు స‌మావేశాన్ని బాయ్ కాట్ చేశార‌ట‌. దీంతో షాక్ తిన్న పుట్టా... ప్ర‌భుత్వం నియ‌మించిన త‌న‌ను ఎలా అడ్డుకుంటారంటూ, స‌మావేశాలు నిర్వ‌హించ‌కుండా ఎలా చేస్తారంటూ త‌న‌దైన శైలి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొత్తంగా టీడీపీ పాల‌క మండ‌లి స‌మావేశాన్ని చివ‌రిసారిగా నిర్వ‌హించి ముచ్చ‌ట తీర్చుకుందామ‌నుకున్న పుట్టా కోరిక మాత్రం తీర‌లేద‌న్న మాట‌.