Begin typing your search above and press return to search.

మైదుకూరు బ‌రిలో డీఎల్‌!... పుట్టా ప‌రిస్థితేంటో?

By:  Tupaki Desk   |   20 Feb 2019 11:08 AM GMT
మైదుకూరు బ‌రిలో డీఎల్‌!... పుట్టా ప‌రిస్థితేంటో?
X
పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌... తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) బోర్డు చైర్మ‌న్‌ గా ఉన్నా... ఆయ‌న క‌ల వేరే. క‌డ‌ప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా చ‌ట్ట‌స‌భ‌లో కాలు మోపాల‌న్న‌దే ఆయ‌న జీవితాశయం. ఈ మాట‌ను ఇప్ప‌టికే చాలా సార్లు స్వయంగా ఆయ‌నే చెప్పారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌న‌దైన శైలి మంత్రాంగం నెర‌పిన పుట్టా... హేమాహేమీల‌ను కాద‌ని త‌న‌కే మైదుకూరు టికెట్ ద‌క్కించుకున్నారు. ఇందులో త‌న వియ్యంకుడు - టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు పాత్రే కీల‌క‌మ‌న్న విష‌యం ర‌హ‌స్య‌మేమీ కాదు. అయితే ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బ‌రిలోకి దిగిన సీనియ‌ర్ నేత ర‌ఘురామిరెడ్డి చేతిలో పుట్టా చిత్తైపోయారు. అయితేనేం... ఏదో ఒక ప‌ద‌వి సంపాదించాల్సిందేన‌న్న క్ర‌మంలో పుట్టా య‌త్నాలు మొద‌లెడితే... పుట్టా లాంటి ఆర్థికంగా స్థితిమంతుడిగా ఉన్న నేత త‌న‌కు ఎంతైనా అవ‌స‌రమ‌న్న కోణంలో ఆలోచించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఆయ‌న‌ను టీటీడీ చైర్మ‌న్‌ గా నియ‌మించారు.

టీటీడీ చైర్మ‌న్‌ గా ఉన్న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైదుకూరు టీడీపీ అభ్య‌ర్థిని తానేన‌ని పుట్టా చెబుతున్నారు. ఇదే మాట‌ను ఆయ‌న బ‌హిరంగంగానూ మాట్లాడుతున్నారు. ఎన్ని ప‌ద‌వులున్నా - ఏ స్థాయి ప‌ద‌వులు ఇచ్చినా మైదుకూరు ఎమ్మెల్యేగా తాను గెలిచి నిల‌వాల్సిందేనని పుట్టా చాలా గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్నార‌ని చెప్పాలి. అయితే ఆయ‌న జీవితాశయం ఈ ద‌ఫా నెర‌వేరే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. గ‌డ‌చిన సారి వైరి వ‌ర్గం దెబ్బ‌కు పుట్టాకు షాక్ త‌గిలితే... ఈ ద‌ఫా మాత్రం సొంత పార్టీ నుంచే పుట్టాకు షాక్ త‌గ‌ల‌నుంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో జిల్లాల వారీగా పార్టీ నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న చంద్ర‌బాబు... నేడు క‌డ‌ప జిల్లా నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగానే క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ మోస్ట్ నేత‌ - మాజీ మంత్రి - మైదుకూరు పేరు విన‌ప‌డ‌గానే గుర్తుకు వ‌చ్చే డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా చంద్ర‌బాబుతో భేటీ కానున్నార‌ట‌. చాలా కాలం నుంచి టీడీపీలోకి చేరిపోతారంటూ ప్ర‌చారం సాగుతున్న డీఎల్‌... ఎట్ట‌కేల‌కు ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైదుకూరు టికెట్ డీఎల్ కేన‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే నిర్ధారించ‌గా - ఆ విష‌యం అందిన నేప‌థ్యంలోనే చంద్ర‌బాబుతో భేటీకి డీఎల్ త‌లూపినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ద‌ఫా మైదుకూరు టికెట్ డీఎల్ కేన‌ని క‌న్ ఫార్మ్ అయిపోయింద‌ని చెప్పాలి. మ‌రి డీఎల్ ఎంట్రీ ఇస్తే.. మ‌రి పుట్టా సుధాకర్ యాద‌వ్ ప‌రిస్థితి ఏమిటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇంట్లో కూర్చోవాల్సిందేనా? అంటే... అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. అయితే మైదుకూరు అసెంబ్లీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దిలేది లేద‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పిన పుట్టా... చంద్ర‌బాబు నిర్ణ‌యంతో ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తారోన‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. అంటే... జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయ‌తీ ఓ కొలిక్కి వ‌చ్చింద‌ని ఊపిరి పీల్చుకుంటున్న చంద్ర‌బాబు... ఇప్పుడు తాను తీసుకుంటున్న నిర్ణ‌యంతోనే ఎంట్రీ ఇస్తున్న‌ మైదుకూరు పంచాయ‌తీని ఎలా చ‌క్క‌బెడ‌తారో చూడాలి.