Begin typing your search above and press return to search.

బతికించలేక పార్టీ మారిపోయారా అజయ్?

By:  Tupaki Desk   |   25 April 2016 4:33 AM GMT
బతికించలేక పార్టీ మారిపోయారా అజయ్?
X
రాజకీయ నాయకులకు గర్ల్ ఫ్రెండ్స్ కి పెద్ద తేడా ఉండదు. ప్రేమించినంత కాలం ఎంత గాఢంగా ప్రేమిస్తారో.. ఒక్కసారి వద్దనుకున్న మరుక్షణం నుంచి టన్నుల ప్రేమ సంగతి తర్వాత.. గ్రాముల్లో సైతం ప్రేమను పంచటానికి ఏమాత్రం ఇష్టపడరు. ప్రేయసి ప్రేమను మాత్రమే పంచదు. కానీ.. రాజకీయ నాయకులు ప్రేమ సంగతి తర్వాత టన్నుల కొద్దీ ద్వేషాన్ని కుమ్మరించేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పలువురు విపక్షనేతల్ని కారు ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బ తీయటానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించటం తెలిసిందే. తెలంగాణ అధికారపార్టీలోకి అడుగు పెట్టేందుకు గడిచిన కొన్ని రోజులుగా ఆసక్తి ప్రదర్శిస్తున్న అజయ్ కుమార్ కల ఇప్పుడు తీరనుంది. పార్టీ మారుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన అజయ్.. తాను విడిచి వెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శల వర్షం కురిపించారు. కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్ లో ఫలితం ఉందన్న చారిత్రక సత్యాన్ని తాజాగా బయటపెట్టారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించుకుందామని రెండేళ్లుగా తాను ఎంతో ప్రయత్నించినట్లుగా చెబుతున్న అజయ్.. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ఎదురుగాలికి నిలబడలేకపోరతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక.. పార్టీ పరంగా తనకు అన్యాయం జరిగిందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చిన అజయ్.. తన పట్ల పార్టీ వివక్ష ప్రదర్శించిందని ఆరోపించారు. పార్టీ విడిచి వెళ్లేటప్పుడు ఇలాంటి నాలుగు మాటలు అనే కన్నా.. పార్టీలోని లోపాల్ని సంస్కరించే బాధ్యతను ఎందుకు తీసుకోనట్లు..? పార్టీలు మారే వారు బుద్దిగా తమకుతోచిన పార్టీకి సేవలు చేయటం వదిలేసి.. ఇలా మాటలు చెప్పేస్తూ కాలం గడిపేయటం ఏమిటో..?