Begin typing your search above and press return to search.

ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదట!

By:  Tupaki Desk   |   10 Oct 2019 5:25 AM GMT
ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదట!
X
ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. అంతకంతకూ పెరుగుతున్న ఈ ఉద్యమాన్ని కార్మికులు ఎంత సీరియస్ గా తీసుకున్నారో.. ప్రభుత్వం అంతే పంతంగా తీసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకూడదని బిగ్ బాస్ పట్టుదలతో ఉన్నారట. ఉద్యోగుల మెడలు వంచేందుకు ఇదే సరైన సమయమని.. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా తాను కోరుకున్నట్లే కాళ్ల బేరానికి రాక మారరన్న భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా గులాబీ నేతలు పలువురు తమ అంతర్గత మాటల్లో చెబుతున్నారు.

ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రజల మీద పడకుండా చేసేందుకు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. రానున్న రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రైవేటు సిబ్బందితో అన్నిబస్సులు నడుపుతామని చెబుతున్నారు. బస్సులు నడపటంలో ఇబ్బందులు ఎదురు కాకున్నా.. మరో సిత్రమైన ఇబ్బందిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది.

తాత్కాలికంగా తీసుకొచ్చిన సిబ్బందిలో పలువురు చేతివాటాన్ని ప్రదర్శించటం.. టికెట్లు ఇవ్వకుండానే అధిక ఛార్జీలు వసూలు చేయటంపై ప్రజలు మండిపడుతున్నారు. టికెట్ రేటుకు మించి ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో.. ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి.

ఇలాంటి ఉదంతాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలోకి దిగారు. టికెట్ ఛార్జీ కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగులకు బదులుగా డైలీ బేసిస్ లో పని చేస్తున్న కండక్టర్లు రూ.10 ఛార్జీని రూ.20గా వసూలు చేస్తున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా వసూలు చేసే వారిపై తక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

టికెట్ కంటే ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా.. వారిపై చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయటానికి అవసరమైన ఫోన్ నెంబర్లను ప్రతి బస్సులోనూ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పుడూ ప్రదర్శించని కక్కుర్తిని డైలీబేసిస్ కార్మికులు ప్రదర్శించటంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పటం లేదు. ఈ తీరును రానున్న రెండు.. మూడు రోజుల్లో సెట్ చేస్తామన్న ధీమాను రవాణా శాఖామంత్రి పువ్వాడ వ్యక్తం చేస్తున్నారు. అసలోళ్లకు ఉన్న బాధ్యత.. తాత్కాలికంగా పని చేసే వారికి ఎందుకు ఉంటుంది చెప్పండి?