Begin typing your search above and press return to search.

తాతగారి ఊరి గురించి చెప్పిన సింధు

By:  Tupaki Desk   |   23 Aug 2016 8:58 AM GMT
తాతగారి ఊరి గురించి చెప్పిన సింధు
X
సిల్వర్ సింధు నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. తన పూర్వీకులకు సంబంధించిన వివరాల్ని ఆమె సభాముఖంగా ప్రకటించారు. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధుకు ఏపీ సర్కారు సన్మాన మహోత్సవాన్ని నిర్వహించిన వేళ.. ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన చిన్ననాటి గురుతుల్ని నెమరవేసుకున్నారు.

తాను చిన్నతనంలో తాతగారి ఊరైన విజయవాడకు వచ్చేదానినని.. తాను చాలాసార్లు విజయవాడకు వచ్చినట్లుగా వెల్లడించారు. బెజవాడలోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడానని వెల్లడించారు. సింధు నోటి నుంచి వచ్చిన మాటతో ఇప్పటివరకూ ఆమెకు సంబంధించి ఏ ప్రాంతానికి చెందిందన్న భారీ చర్చకు కాస్త తెరపడిందని చెప్పాలి. సింధుకు సన్మానం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పలువురు సింధును తెలంగాణ బిడ్డగా చెప్పారు. ఇదిలా ఉండగా.. తన తాతది విజయవాడ అని సింధు మాటల మధ్యలో చెప్పిన సందర్భంగా విజయవాడ మున్సిపల్ స్టేడియం ఒక్కసారి కరతాళ ధ్వనులతో మారుమోగింది.

ఇదిలా ఉంటే.. సింధు సన్మాన సభ సందర్భంగా మాట్లాడిన ఆమె కోచ్ గోపీ పాత గురుతుల్ని గుర్తు చేసుకున్నారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో పతకం సాధించిన సందర్భంగా భారీ సన్మాన సభను ఏర్పాటు చేశారని.. ఈ సందర్భంలో తాను ఎంతో స్ఫూర్తి పొందానని.. ఆ స్ఫూర్తితోనే తాను తర్వాతి కాలంలో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలుచుకున్నట్లుగా వెల్లడించారు. కరణం మల్లీశ్వరిని సన్మానించిన సమయంలో తాను అక్కడే ఉన్న విషయాన్ని చెప్పిన గోపీ.. ఆ కార్యక్రమాన్ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుగా గుర్తు చేశారు. ఆ ఘటన తనలో ఎంతో స్ఫూర్తిని రగిలించిందని చెప్పారు.