Begin typing your search above and press return to search.

ఒలంపిక్స్ ముందు సింధూకు షాక్!

By:  Tupaki Desk   |   24 Sep 2019 8:21 AM GMT
ఒలంపిక్స్ ముందు సింధూకు షాక్!
X
ఇటీవలే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ గా అవతరించింది మన పీవీ సింధూ.. ఆమె విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది ఇటీవలే నియామకం అయిన కొత్త మహిళా కోచ్ కిమ్ జి హ్యూన్. దక్షిణా కొరియాకు చెందిన ఈమె కోచ్ గా వచ్చిన తర్వాత పీవీ సింధూ ఆటతీరులో ఘననీయమైన మార్పు వచ్చింది. సింధూ వీక్ పాయింట్స్ ను గుర్తించిన కిమ్ జి హ్యూన్ ఆమెకు కొత్త టెక్నిక్స్ చెప్పడంతో సింధూ ఏకంగా ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. సింధూ కూడా గెలిచాక తన కోచ్ ను ఆకాశానికెత్తేసింది.

త్వరలోనే జపాన్ లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ సిద్ధమవుతూ భారత్ కు స్వర్ణం పతకం తేవడానికి సింధూ రెడీ అవుతోంది. ఈ సమయంలోనే పీవీ సింధూకు ఇప్పుడు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.

సింధూను వరల్డ్ చాంపియన్ గా మలిచిన ఆమె కొత్త మహిళా కోచ్ కిమ్ జి హ్యూన్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. నాలుగు నెలల క్రితమే భారత మహిళల సింగిల్స్ కోచ్ గా నియామకం అయిన కిమ్ తన వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రాజీనామా లేఖను సమర్పించింది.

అయితే కిమ్ జి హ్యూన్ వైదొలగడానికి ఆమె భర్తే కారణమని తెలిసింది. కిమ్ భర్త కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. ఆయనకు సర్జరీ కావడంతో ఆరు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.. దీంతో కోచ్ పదవికి స్వస్తి పలికి భర్తను చూసుకునేందుకే కిమ్ వెళ్లినట్టు తెలిసింది. కిమ్ ఒలింపిక్స్ ముందు వైదొలగడం సింధూకు పెద్ద షాక్ లా పరిణమించింది. మరి సింధూ ముందుముందు కూడా ఎలా ముందుకెళ్తుందనేది వేచిచూడాలి.