Begin typing your search above and press return to search.

సింధుకు వంద‌నం ఇప్పుడా?

By:  Tupaki Desk   |   23 Aug 2016 1:30 AM GMT
సింధుకు వంద‌నం ఇప్పుడా?
X
రియోలో ర‌జ‌త ప‌త‌కంతో భార‌త ప‌తాకాన్ని రెపరెప‌లాడించిన తెలుగ‌మ్మాయి పీవీ సింధు ప్రతిభకు ఎట్టకేలకు గుర్తింపు ద‌క్కుతున్నా ఇంత‌కాలం ఆమె స‌త్తాను ఎందుకు ప‌ట్టించుకోలేద‌న్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఆమె అసాధారణ ప్రతిభకు రియో పతకం నిద‌ర్శ‌న‌మైన‌ప్ప‌టికీ ఆమెలోని ప్ర‌తిభ ముందే బ‌య‌ట‌ప‌డింది. టాప్‌ సీడ్స్‌ ను చిత్తు చేసిన షట్లర్‌ గా ఈ సమ్మర్‌ ఒలింపిక్స్‌ లో ఆమె ఒక్క‌సారిగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించినా ఇంత‌కుముందు నుంచే ఆమె సత్తా చాటుతోంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో వరుస విజయాలతో దూసుకెళుతోంది. అయినప్పటికీ ఆమె సాధించిన విజయాలకు తగిన గుర్తింపు రాలేదు. రియో ఒలింపిక్స్‌ కు ముందు పీవీ సింధు ను గురించి ఆలోచించినవారే లేరు. ఎందుకు? అందుకుముందు ఆమె పతకాలు సాధించలేదా? టోర్నీల్లో గెలవలేదా? అంటే అదేమీ కాద‌ని ఆమె సాధించిన ప‌త‌కాలే స‌మాధానం చెబుతున్నాయి. సింధు 2013 - 2014 వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ లలో వరుసగా కాంస్య పతకాలు గెలిచింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ కప్‌ సింగిల్స్‌ లో భారత్‌ కు తొలి పతకం అందించింది కూడా సింధూనే. 30 ఏళ్ల తర్వాత ఆ ఘనతను సాధించిన సింధును ఇంత‌కాలం ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. 1983లో ప్రకాశ్‌ పదుకునే కాంస్య పతకం గెలిచారు. అంతకుముందు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల్లో గానీ - మహిళలో గానీ పతకం గెలిచిన వారు లేరు. భారత నంబర్‌ వన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కూడా సింధు గెలిచిన రెండేళ్ల తర్వాత 2015లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ గెలిచింది. కానీ సింధు ఈ నాలుగేళ్ల కాలంలో మరుగున పడింది. సైనా నెహ్వాల్ - సానియా మీర్జాల‌కే ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి గుర్తింపు ద‌క్కింది. మ‌న ముద్దు బిడ్డ‌లుగా - బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వారే చెలామ‌ణీ అయ్యారు.

2012 ఆరంభంలో సింధు 17 ఏళ్ల వయసులోనే చైనాకు చెందిన లీ జురూయ్‌ ను ఆమె సొంత గడ్డపై ఓడించింది. అప్పటికే జురూయ్‌ లండన్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌. అంతేకాదు ప్రపంచ - ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ గా వెలుగొందుతున్న కరోలినా మారిన్‌(ఈ ఏడాది సింధుపై గెలిచి ఒలింపిక్సు స్వ‌ర్ణం గెలిచిన ష‌ట్ల‌ర్)ను గతేడాది అక్టోబర్‌ లో సింధు ఓడించింది. కాబ‌ట్టి ఇప్పుడు లభిస్తున్న ప్రశంసలు సింధుకు ఎప్పుడో రావాల్సింది. ఎట్టకేలకు ఒలింపిక్‌ పతకంతో భారత్‌ ఆమెను గుర్తించింది. బ‌హుమ‌తులు మీద బ‌హుమ‌తులు కుమ్మ‌రించారు. ఇంత‌కాలం ఈ ప్రోత్సాహం ఏమైందో తెలియ‌దు.

ఒలింపిక్స్‌ కు వెళ్లే అథ్లెట్లపై ఎంతటి ఒత్తిడి ఉంటుందో ఎవ్వరూ ఊహించలేదు. ఒలింపిక్స్‌ కోసం వాళ్లు పడ్డ శ్రమ ఆ సమయంలో గుర్తుకు రాదు.

ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌ కు స్వర్ణ పతకం అందించిన ఏకైక వ్యక్తి షూటర్‌ అభినవ్‌ బింద్రా.. అత్యుత్తన్న స్థాయికి ఎదిగితేనే ఈ దేశంలో మద్దతు లభిస్తుందని బింద్రా అన్న మాటలను మర్చిపోకూడదు. పాల‌కులు - వ్య‌వ‌స్థ‌ను ఉద్దేశించి బింద్రా అన్న ఆ మాటలు ప్రజలకూ వ‌ర్తిస్తాయి. మొన్న సింధు ఫైన‌ల్ కు చేరిన త‌రువాత మాత్ర‌మే భార‌తీయుల్లో 90 శాతం మంది తొలిసారిగా టీవీల్లో బ్యాడ్మింట‌న్ మ్యాచ్‌ ను చూసి ఉంటారు. అంతెందుకు ఆరోగ్యం కోసం పొద్దున్నే బ్యాడ్మింట‌న్ ఆడే ల‌క్ష‌లాది మందిలో ఒక్క శాతం కూడా ఎన్న‌డూ టీవీల్లో కానీ, మైదానాల్లో కానీ ష‌టిల్ మ్యాచ్ లు చూసి ఉండ‌దు. క్రికెట్ చూస్తారు.. అడ‌పాద‌డ‌పా టెన్నిస్ చూస్తారు.. కార్పోరేటీక‌ర‌ణ చెందిన క‌బ‌డ్డీని కూడా ప్రో క‌బ‌డ్డీ అంటేనే చూస్తున్న ఈ దేశంలో ఇక‌నైనా సింధులాంటి క్రీడాకారిణుల‌కు - బ్యాడ్మింట‌న్ లాంటి ఆట‌ల‌కు ఆద‌ర‌ణ పెరిగితే అత‌కంటే కావాల్సిందేముంటుంది.

ఇలా ప‌త‌కాలు తెచ్చిన‌ప్పుడు, ఒలింపిక్సులో ఫైనల్‌ కు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా నిత్యం ఆట‌గాళ్ల‌కు - ఆట‌ల‌కు మద్దతు దొరికితే... ఆట‌గాళ్ల‌కు మీ దేశం మీకు తోడుంద‌న్న భ‌రోసా క‌ల్పిస్తే మరిన్ని పతకాలు రావ‌డం ఖాయం.