Begin typing your search above and press return to search.

త్వరలోనే విశాఖలో సింధు బ్యాడ్మింటన్ అకాడెమీ

By:  Tupaki Desk   |   13 Aug 2021 4:30 PM GMT
త్వరలోనే విశాఖలో సింధు బ్యాడ్మింటన్ అకాడెమీ
X
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పతకం సాధించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు....టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 2024లో పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో కచ్చితంగా పసిడి పతకం తెస్తానని సింధు చెబుతోంది. తన తల్లిదండ్రులు, చాముండేశ్వరీనాథ్ తో కలిసి ఈ రోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సింధు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సింధు...అనంతరం మీడియాతో మాట్లాడింది.

త్వరలోనే విశాఖపట్నంలో ఉత్సాహవంతులైన యువతీయువకుల కోసం బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించబోతున్నానని సింధు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ అకాడెమీని ఏర్పాటు చేస్తానని వెల్లడించింది. సరైన వసతులు, ప్రోత్సాహం లేక యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికోసం తాను అకాడెమీని ఏర్పాటు చేయబోతున్నానని చెప్పింది.

ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెండు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్ గా సింధు రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సింధును సీఎం జగన్ సన్మానించిన విషయం విదితమే. సింధుకు రూ.30లక్షల నగదు నజరానా ప్రకటించిన జగన్...విశాఖలో బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని సింధుకు భరోసా ఇచ్చారు.

గతంలో రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తో మెరిసిన సింధుపై నాటి సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. సింధుకు రూ.3 కోట్ల నజరానా ప్రకటించిన చంద్రబాబు, ఆమె డిప్యూటీ కలెక్టర్ గా నియమించి గౌరవించారు. సింధుకు రూ.5కోట్ల నజరానా ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్...ఆమెకు హైదరాబాద్ లో 1000 గజాల నివాస స్థలం కేటాయించి సత్కరించారు.