Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ చీఫ్ గా మాధవ్?

By:  Tupaki Desk   |   13 March 2020 12:57 PM GMT
ఏపీ బీజేపీ చీఫ్ గా మాధవ్?
X
తెలంగాణ బీజేపీ కి కొత్త ఉడుకు నెత్తురును ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఏపీలోనూ అలాంటి ప్రయోగం చేయడానికి రెడీ అయ్యిందట.. దూకుడుగా ముందుకెళ్తూ అధికార టీఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెడుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించి బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. బీసీ నేతకే మళ్లీ పట్టం కట్టింది. ఆ కోవలోనే ఏపీలోనూ బీజేపీ అధ్యక్షుడి మార్పు తప్పదన్న సంకేతాలు ఇచ్చినట్టైంది.

ఏపీ బీజేపీ లో సీనియర్ నాయకుడు దూకుడుగా ఉండే ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడం ఖాయమన్న చర్చ సాగుతోంది. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం త్వరలోనే ముగియబోతోంది. ఆయన స్థానంలో పార్టీ అధిష్టానం మాధవ్ ను ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించాలని డిమాండ్ ఉన్నప్పటికీ తెలంగాణ లో లాగానే ఉడుకురక్తాన్ని జోడించాలని యోచిస్తున్న బీజేపీ అధిష్టానం యువకుడైన మాధవ్ కే బీజేపీ ఏపీ పగ్గాలు అప్పజెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీ అధ్యక్ష రేసులో సీనియర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, సీమ నుంచి సోమగుంట విష్ణు వర్ధన్ రెడ్డి వంటి నేతలు బీజేపీ అధ్యక్ష స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. సోమగుంట పేరును బీజేపీ అధిష్టానం అసలు పరిశీలనలోకి తీసుకోలేదని అంటున్నారు.

మాధవ్ ఎంపికకు ప్రధాన కారణం.. ఆయన వెనుకబడిన ఉత్తరాంధ్రకు చెందిన వాడు కావడం.. పైగా బీసీ నేత కావడం ప్లస్ గా మారింది. ఆర్ఎస్ఎస్ నుంచి రావడం మరింత బలాన్ని ఇస్తోంది. చాలాకాలంగా పార్టీని నమ్ముకొని ఉంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లోనూ విజయం సాధించారు. దీంతో ఆయనకే పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నట్టు తెలుస్తోంది.