Begin typing your search above and press return to search.

బండ్ల గ‌ణేష్‌కు చెక్ పెడ‌తానంటోన్న పీవీపీ

By:  Tupaki Desk   |   8 Oct 2019 1:58 PM GMT
బండ్ల గ‌ణేష్‌కు చెక్ పెడ‌తానంటోన్న పీవీపీ
X
నిర్మాత‌, వైసీపీ నాయ‌కుడు పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) వ‌ర్సెస్ టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, నిర్మాత బండ్ల గ‌ణేష్ మ‌ధ్య రెండు రోజులుగా మాట‌ల యుద్ధం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. పీవీపీని టార్గెట్‌గా చేసుకుని బండ్ల ప‌రోక్షంగా చేసిన ట్వీట్‌పై ఈ రోజు పీవీపీ తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు. టెంప‌ర్ సినిమాకు ఫైనాన్స్ చేయాల‌ని 2013 నుంచి బండ్ల త‌న‌ను క‌లవ‌డంతో ఆర్థిక‌సాయం చేశాన‌ని చెప్పారు. 2015 ఫిబ్ర‌వ‌రిలో సినిమా రిలీజ్ అయినా త‌మ‌కు చెల్లించాల్సిన మొత్తం చెల్లించ‌లేద‌ని.. అదేంట‌ని అడిగితే దానికి అనుబంధంగా మ‌రో అగ్రిమెంట్ చేసుకున్నాడ‌ని పీవీపీ చెప్పారు.

ఆరేళ్లుగా డ‌బ్బులు ఎగ్గొట్టేంద‌కు బండ్ల ప్ర‌య‌త్నాలు చేస్తూ చీటింగ్ మైండ్ సెట్‌తో ముందుకెళ్లాడ‌న్నారు. ఆ టైంలో ఓ ప్రైవేట్ హోట‌ల్లో క‌లిసి మాట్లాడుకుంటున్న టైంలో కూడా ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడినా తాము మాత్రం స‌హ‌నంతోనే ముందుకు వెళ్లామ‌ని పీవీపీ తెలిపారు. చివ‌ర‌కు విసిగిపోయి తాము చెక్ బౌన్స్ కేసులు, సివిల్ కేసులు పెట్టాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇదిలా ఉండ‌గానే రెండు రోజుల క్రితం బండ్ల గ‌ణేష్ అనుచ‌రులుగా చెప్పుకున్న కొంద‌రు త‌మ ఇంటికి వ‌చ్చి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని పీవీపీ పేర్కొన్నారు.

బాకీ సెటిల్ గురించి మాట్లాడేందుకు వ‌చ్చామ‌ని వాళ్లు చెప్పార‌ని... అది ఆఫీస్‌లో మాట్లాడుకుందామ‌ని చెప్పినా విన‌కుండా.. త‌మ‌ను దూషించ‌డంతో పాటు హోం మంత్రి తెలుసంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పీవీపీ పేర్కొన్నారు. తాము ప‌దేళ్ల‌లో వంద‌కు పైగా సినిమాల‌కు ఫైనాన్స్ చేసినా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేద‌ని.. క‌మ‌ల్‌హాస‌న్ విశ్వ‌రూపం సినిమాకు సైతం ఫైనాన్స్ చేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు.

బండ్ల ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్న వ్యాఖ్య‌ల్లో కూడా వాస్త‌వం లేద‌ని.. ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్ బ్యాoక్ ద్వారానే చెల్లింపు జ‌రిగింది.. ఎవ‌రైనా బండ్ల డ‌బ్బులు ఇచ్చార‌ని నిరూపిస్తే ఆ అమౌంట్ మొత్తం రు.30 కోట్లు తాను ఫ్రీగా ఇచ్చేస్తాన‌ని పీవీపీ స‌వాల్ విసిరారు. ఇలాంటి వాళ్ల‌కు ఇండ‌స్ట్రీలో ఎవ‌రో ఒక‌రు బుద్ధి చెప్పాల్సి ఉన్నందున తాను చివ‌ర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌క త‌ప్ప‌లేద‌ని పీవీపీ పేర్కొన్నారు. మ‌రి ఈ ఇద్ద‌రి వివాదం ఎందాకా వెళుతుందో ? చూడాలి.