Begin typing your search above and press return to search.

కేశినేని వర్సెస్ పీవీపీ.. ఇంట్లో ఆడవాళ్లనూ గొడవలోకి లాగారు

By:  Tupaki Desk   |   3 Aug 2019 2:23 PM GMT
కేశినేని వర్సెస్ పీవీపీ.. ఇంట్లో ఆడవాళ్లనూ గొడవలోకి లాగారు
X
ఏపీలో ఎన్నికల తరువాత ట్విటర్ వేదికగా కొట్లాడుకుంటున్న విజయవాడ లోక్‌సభ ప్రత్యర్థులు కేశినేని నాని - పీవీపీల రాజకీయ వివాదం చినిగి చాటంతయి ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి దిగి ఆ కుటుంబాల్లోని మహిళలనూ వివాదంలోకి లాగే పరిస్థితికి వచ్చింది. విజయవాడ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో కేశినేని నాని చేతిలో పీవీపీ ఓడిపోయారు. ఆ తరువాత కేశినేని సొంత పార్టీ టీడీపీ పై ట్విటర్ వేదికగా అటాక్ చేశారు.. అది కొనసాగుతున్న కొద్దిరోజులకే కేశినేని రాజకీయ ప్రత్యర్థి పీవీపీ కూడా ట్విటర్ వేదికగా రాజకీయ అటాక్ మొదలుపెట్టారు. ఆయన కేశినేని నానిని టార్గెట్ చేస్తూ పోస్టింగులు చేశారు. ఇప్పుడు పీవీపీ తాను, తన కుటుంబం నీతి నిజాయితీలకు మారుపేరని చెప్పుకొనేలా తన భార్య ఏపీలోనే అత్యధికంగా ఆదాయ పన్ను కట్టే వ్యక్తని.. ఆమె మొన్న రూ.44.78 కోట్ల పన్నులు చెల్లించారంటూ ఆ రశీదులను షేర్ చేశారు. పన్ను చెల్లించడంలో ఆదర్శంగా ఉండాలంటూ ఆయన కేశినేని నానిని సవాల్ చేశారు.

పీవీపీ తన ఫేస్ బుక్ పేజీలో తాజాగా కేశినేని నాని పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. నువ్వు, మీ నాన్న, మీ తాత అందరూ కలిసి గత 90 ఏళ్లలో కట్టిన పన్ను నా భార్య సూరెడ్డి ఝాన్సీ ఈ ఏడాది కట్టిన రూ.44.78 కోట్ల కంటే తక్కువ. పన్నులు కట్టే విషయంలో ఆదర్శంగా ఉండు అంటూ పీవీపీ సవాల్ విసిరారు.

కేశినేని నాని తండ్రి, తాత కూడా రవాణ సంబంధిత వ్యాపారాల్లో ఉండడంతో పీవీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో పీవీపీపై నాని, ఆయన అనుచరులు కలిసి పలు ఆరోపణలు చేయడం.. ముఖ్యంగా పీవీపీపై ఉన్న ఆర్థిక అవతవకల ఆరోపణలపై విమర్శలు చేశారు. దానికి పీవీపీ ఇప్పుడు బదులు తీర్చుకున్నట్లుగా కనిపిస్తోంది.