Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వైపు క‌మ‌ల‌నాథుల‌కు గాలి మ‌ళ్లిన‌ట్లుందే?

By:  Tupaki Desk   |   3 April 2018 11:48 AM GMT
ప‌వ‌న్ వైపు క‌మ‌ల‌నాథుల‌కు గాలి మ‌ళ్లిన‌ట్లుందే?
X
ఏపీ రాజ‌కీయం చ‌టుక్కున మారిపోతోంది. ఏ రోజు ఎవ‌రు ఎలా మాట్లాడ‌తారో అర్థం కాన‌ట్లుగా ప‌రిస్థితులు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ భుజాలు.. భుజాలు రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ.. టీడీపీ నేత‌లు ఇప్పుడు పాము.. ముంగిస మాదిరి మాటా.. మాటా అనుకోవ‌టం తెలిసిందే.

ఆ మ‌ధ్య‌న ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన క‌మ‌ల‌నాథులు ఇప్పుడు అదే ప‌వ‌న్ ను పొగిడేయ‌టం స‌రికొత్త ప‌రిణామంగా చెప్పాలి. ఓప‌క్క ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పార్ల‌మెంటు వెళ్లి మోడీ స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు సంధిస్తున్న వేళ‌.. ఏపీలో బీజేపీ నేత‌లు బాబు స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం.

ఏపీ బీజేపీ నేత‌లు పైడికొండ‌ల మాణిక్యాల‌రావు.. విష్ణుకుమార్ రాజులు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ స‌మావేశాల్లో త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వటం లేద‌న్న ఇద్ద‌రు నేత‌లు.. తాము స‌భ‌లో మాట్లాడుతున్నా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్నారు. స‌మైక్య ఉద్య‌మాల స‌మ‌యంలో తాము ఏపీ గ్రామాల్లోకి వెళ్ల‌లేక‌పోయేవాళ్ల‌మ‌ని.. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేద‌న్నారు.

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడిన త‌ర్వాత నుంచి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవినీతి వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల్లోకి వెళ్లింద‌న్నారు. టీడీపీ నేత‌లు చేస్తున్న వాద‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌టం లేద‌న్నారు. రాష్ట్రంలో అవినీతి జ‌రుగుతుండ‌టంతోనే కేంద్రం నిధులు క‌ట్ చేసి ఉంద‌న్న భావ‌న‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నార‌న్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి ఏమిటో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు.

ఏపీలో 80 శాతం కాపులు ప‌వ‌న్ తోనే ఉన్నార‌ని.. వారిని ఆయ‌న ఎలా వాడుకుంటారో చూడాల‌న్న వ్యాఖ్య‌ను మాణిక్యాల రావు చేశారు. బీజేపీని దెబ్బ తీసేందుకు టీడీపీ బృందాలు కొన్ని క‌ర్ణాట‌క‌కు వెళ్లి.. అక్క‌డ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నాయ‌న్నారు.

బీజేపీపై టీడీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌టం లేద‌న్నారు. రాఫెల్ డీల్ లాంటి పెద్ద పెద్ద విష‌యాల గురించి త‌ర్వాత మాట్లాడుకోవ‌చ్చు కానీ.. మొద‌ట సాండ్‌.. ల్యాండ్ ఇష్యూల‌పై మాట్లాడితే బాగుంటుంద‌ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఏపీని ఈశాన్య రాష్ట్రాల‌తో పోల్చ‌టం స‌రికాద‌ని చెబుతున్న రాజు.. ఎప్ప‌టిలానే తాను ఆంధ్రోడి కంటే కూడా బీజేపీ వాడినేన‌న్న భావ‌న క‌లిగేలా మాట్లాడారు. బాబుపై విరుచుకుప‌డే క్ర‌మంలో ఏపీ ప్ర‌జ‌ల్లో త‌మ‌కు బ‌లం లేద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ను ఎత్తేసేలా మాట్లాడిన మాట‌ల్లో అర్థం ఉంద‌న్న విష‌యాన్ని ఇద్ద‌రు బీజేపీ నేత‌లు గుర్తిస్తే మంచిది.