Begin typing your search above and press return to search.

య‌న‌మ‌ల వ్యాఖ్య‌ల‌పై ఆ మంత్రి కౌంట‌ర్‌

By:  Tupaki Desk   |   30 April 2016 9:24 AM GMT
య‌న‌మ‌ల వ్యాఖ్య‌ల‌పై ఆ మంత్రి కౌంట‌ర్‌
X
అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న సంబంధాలు! మిత్ర `బంధం` ఎప్పుడు తెగిపోతుందో తెలియని ప‌రిస్థితి! ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు.. ప్రతివిమర్శ‌లూ!! `నువ్వు ఒక‌టంటే నేను రెండంటా` అనేంత‌గా దూకుడు మీదున్న నేత‌లు! నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు!! ఇదీ ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో టీడీపీ-బీజేపీ మ‌ధ్య ప‌రిస్థితి. ఇప్పుడు వైకాపా అధినేత జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఈ పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌తీసింది.

తెలుగుదేశం ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ కేంద్ర‌మంత్రుల‌కు ఫిర్యాదు చేయ‌డం.. వాటిని వారంతా సావ‌ధానంగా విన‌డం ఇవ‌న్నీ తెలుగుదేశం నేత‌ల‌కు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. త‌మ‌పై ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన నేత‌ల‌కు అపాయింట్ ఇవ్వ‌డ‌మేమిట‌ని కొంద‌రు ఏపీ మంత్రులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే వారి వ్యాఖ్య‌ల‌కు మ‌రో మంత్రి కౌంట‌ర్ ఇచ్చారు. ఇంత‌కు ఆ ఇద్ద‌రు మంత్రులు బాబు కేబినెట్‌ లోనే ఉన్నా ఒక‌రు టీడీపీకి, మ‌రొక‌రు బీజేపీకి చెందిన వారు.

సాధార‌ణంగా టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయాలంటే బీజేపీలో వినిపించే పేర్లు.. సోము వీర్రాజు - క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌, లేక పురందేశ్వ‌రి! కానీ కేబినెట్‌ లో మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు మ‌రో మంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. “రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కేంద్రమంత్రులను క‌ల‌వ‌డం అసాధార‌ణ విష‌యం కాదు. గ‌తంలోనూ ఆయ‌న ఈ విధంగా కలిశారు. ఇది కూడా అటువంటిదే తప్ప దానికి ప్రత్యేకత ఏమీ లేదు. దానిని తప్పు పట్టనవసరం లేదు. ఈ విష‌యం యనమల రామకృష్ణుడుకి తెలియదనుకోలేము. జగన్ మోహన్ రెడ్డికి కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వడం తప్పేమీ కాదు.`` అంటూ వ్యాఖ్యానించారు.

ఈ విష‌యం త‌ప్ప‌యితే.. అమ‌రావ‌తి శంకుస్థాప‌న స‌మ‌యంలో మంత్రులు జ‌గ‌న్ వ‌ద్ద‌కు ఎందుకు వెళ్లారు? అని ప్ర‌శ్నించారు. `మీరు చేస్తే ఒప్పు అయ్యింది..తాము చేస్తే తప్పేలా అవుతుంది` అని ప్రశ్నించారు. అలాగే వైకాపా ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డం తెదేపా వారి విజ్ఞ‌తకు సంబంధించిన విష‌య‌మ‌ని అన్నారు. మొత్తానికి ఒక‌ప‌క్క య‌న‌మ‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూనే మ‌రో ప‌క్క వ‌ల‌స‌ల‌పైనా టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు మాణిక్యాల‌రావు!