Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా ఏపీకి వద్దంటున్న ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   4 Aug 2016 12:47 PM GMT
ప్రత్యేక హోదా ఏపీకి వద్దంటున్న ఏపీ మంత్రి
X
​రాజకీయాల్లో రోజురోజుకు నేతల మనస్తత్వాలు దిగజారుతూ వస్తున్నాయి. ఏపీ విభజన ఏపీకి ఎంతో నష్టం చేసి ఉండొచ్చు గాని నాయకులు ఎంత స్వార్థపరులో - వాళ్ల మనస్తత్వాలు ఎలాంటివో ప్రజలకు బట్టలిప్పి చూపించింది. ఆ విభజన కారణంగా తెలుగు ప్రజల్లో ముఖ్యంగా ఆంధ్రుల్లో నాయకులపై విశ్వసనీయత దారుణంగా పడిపోయింది. అయితే, తదనంతరం కూడా వారిలో మార్పేమీ కనపడటం లేదు. ఎవరికి వారు తమ తమ నాయకత్వ లక్షణాలు ఎంత నీచంగా ఉన్నాయో చూపుకుంటున్నారు.

సాధారణంగా​ నాయకులు రెండు రకాలు. ప్రజా నాయకులు - పార్టీ నాయకులు. ప్రజల మెచ్చింది మాట్లాడే వారు ప్రజా నాయకులు. పార్టీలు మెచ్చేలా మాట్లాడేవారు పార్టీ నాయకులు. తాజాగా ఏపీ మంత్రి బీజేపీ నేత మాణిక్యాల రావు చేసిన వ్యాఖ్యలు వింటే ఈ స్టేట్ మెంట్ మీకు నిజమే అనిపిస్తుంది. ప్రత్యేక హోదాపై బీజేపీ చేసిన మోసం గురించి ఏపీ ప్రజలు రగిలిపోతుంటే... ఏపీ మంత్రి అయ్యి ఉండి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం పార్టీ మెప్పు కోసం "ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు అని, హోదా లేకుండానే ఏపీని అభివృద్ధి చేయొచ్చని " అంటున్నారు. పైగా అదేదో ఆంధ్ర రాష్ట్రం దేశంలో భాగమే కాదన్నట్టు.... కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం దయాదాక్షిణ్యాలు చూపడం ఏంటి... రాష్ట్ర సంక్షేమాలు చూసే బాధ్యత కేంద్రానిది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఎన్నుకుంటేనే కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికవుతాయి. ఈ కనీస సూత్రాలను బీజేపీ విస్మరిస్తే ఎలా... ఎందుకు కోరికోరి వీరి ఏపీతో తలగోక్కొంటున్నారో విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు.