Begin typing your search above and press return to search.

కోట్లు సంపాదించాలని క్యూనెట్ లో చేరి ప్రాణాలు తీసుకున్న ఐటీ

By:  Tupaki Desk   |   1 Aug 2019 6:00 AM GMT
కోట్లు సంపాదించాలని క్యూనెట్ లో చేరి ప్రాణాలు తీసుకున్న ఐటీ
X
కోట్లు సంపాదించాలన్న ఆశ చాలామందిలో ఉంటుంది. అయితే.. కోట్లు వెనకేసేందుకు నడిచే దారి కూడా చాలా ముఖ్యం. ఆ విషయంలో దొర్లే తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కలలు కనటం ఒక ఎత్తు.. ఆ కలల్ని నెరవేర్చుకోవటం మరో ఎత్తు. తాజాగా కలలు కని.. ఆ కలల్ని సాకారం చేసుకునే క్రమంలో అప్పుల పాలై.. ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగి అరవింద్ ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చాడు. చక్కటి ఉద్యోగంతో ఉన్న అతను మరింత సంపాదించాలని కలలు కన్నాడు. కోట్లు కూడబెట్టాలన్న ఆశతో.. మార్గాలు అన్వేషించగా భారీగా పెట్టుబడులు పెడితే అంతకు రెట్టింపు డబ్బులు వస్తాయని.. సరిగా వర్క్ వుట్ చేస్తే ఏకంగా కోట్లాది రూపాయిలు సొంతమవుతాయని అంచనా వేసిన అరవింద్.. తనకు తెలిసిన క్యానెట్ కంపెనీలో సభ్యత్వం తీసుకున్నాడు.

డైరెక్ట మార్కెటింగ్ కు చెందిన క్యూనెట్ లో ఉత్పత్తులతో పాటు.. భారీగా సభ్యుల్ని చేర్పిస్తే కమిషన్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో ఆశ పడిన అరవింద్ తన స్నేహితులు చెప్పిన మీదట క్యూ నెట్ లో చేరారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తాన్ని సంపాదించేందుకు అవకాశం ఉందన్నభావనతో క్యూ నెట్ లో చేరాడు. తను చేరటమే కాదు.. తనకు తెలిసిన వారిని చేర్పించి.. వారి చేత దాదాపుగా రూ.20లక్షల వరకు పెట్టించారు.

ఇటీవల కాలంలో క్యూ నెట్ మీద పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి ప్రచారాలు తప్పని.. తాము సుద్దపూసలుగా పేర్కొంటూ కంపెనీ ప్రకటనలు ఇస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సైబరాబాద్ పోలీసులు క్యూనెట్ మోసం చేస్తుందంటూ పేర్కొంటూ ఇప్పటివరకూ 70 మందిని అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. దాదాపు 30 కేసులు నమోదు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అరవింద్ విషయానికి వస్తే.. తాను చేర్పించిన వారి నుంచి పెరిగిన ఒత్తిడితో పాటు.. భారీగా పెట్టుబడులు పెట్టి.. అవి సరిగా రాకపోవటంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

సమస్యల నుంచి బయటపడేందుకు అప్పు చేయటం..వాటిని తీర్చలేక కిందామీదా పడుతున్న అరవింద్.. తాజాగా ఇంట్లో ఎవరూ లేని వేళ.. ఆత్మహత్యకు పాల్పడి షాకిచ్చారు. ఇదిలా ఉంటే తమ సభ్యుడైన అరవింద్ ఆత్మహత్య చేసుకోవటం తమను వేదనకు గురి చేస్తుందని.. తమకు ఆయన ఎప్పుడూ ఎలాంటి సమస్యల్ని చెప్పలేదన్నారు. డబ్బు సంపాదించాలన్న ఆశ తప్పేం కాదు. కానీ.. అసలు కంటే కొసరు ముద్దు అన్న భావనతో లేనిపోని తప్పులు చేస్తే జరిగే నష్టం భారీగా ఉంటుంది. ఇందుకు నిలువెత్తు రూపంగా అరవింద్ వ్యవహారాన్ని చెప్పాలి.