Begin typing your search above and press return to search.

బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2కి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో తెలుసా?

By:  Tupaki Desk   |   11 Sep 2022 2:57 PM GMT
బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2కి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో తెలుసా?
X
బ్రిటన్ చరిత్రలోనే సుధీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్2 కన్నుమూశారు. స్కాట్లాండ్ లోని బల్మోరల్ క్యాజిల్ లో ఆమె తుది శ్వాస విడిచారు. రాజ కుటుంబ సంప్రదాయంలో బ్రిటన్ లో ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. లండన్ కు తీసుకొచ్చిన తర్వాత ఆమె శవపేటికను వెస్ట్ మినిస్టర్ హాల్లో నాలుగు రోజుల పాటు ఉంచుతారు. అంత్యక్రియలకు ముందుగా ఆమె కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పిస్తారు.

బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో అత్యంత పురాతనమైన కట్టడాల్లో వెస్ట్ మినిస్టర్ హాల్ కూడా ఒకటి. ఈ హాల్ లో చివరిసారిగా 2002లో రాజ కుటుంబానికి చెందిన క్వీన్ తల్లి శవపేటికను ఉంచారు. అప్పట్లో 2 లక్షలమందికి పైగా ప్రజలు ఆమెకు నివాళులర్పించారు.

మధ్యయుగం నాటి కలపతో 11వ శతాబ్ధంలో నిర్మించిన ఈ హాల్ లో ‘క్యాటఫాక్’గా పిలిచే వేదికపై రాణి శవపేటికను ఉంచుతారు. రాజ కుటుంబానికి భద్రత కల్పించే సైనికులే ఈ శవ పేటిక చుట్టూ రక్షణగా ఉంటారు. బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి అంతిమ యాత్రగా రాణి శవపేటికను తీసుకెళ్తారు. ఆమె వెంట రాజ కుటుంబ సభ్యులు వస్తారు. సైనిక కవాతు కూడా ఉంటుంది. వీధుల గుండా అంతిమయాత్ర కదిలేటప్పుడు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు లండన్ రాయల్ పార్క్ లలో కార్యక్రమాన్ని బ్రాడ్ కాస్ట్ చేసేందుకు పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తారు.

రాయల్ స్టాండర్డ్ పతాకంలో ఆమె శవపేటికను చుడతారు. వెస్ట్ మినిస్టర్ హాల్ కు చేరుకున్నాక దీనిపై ఇంపీరియల్ స్టేట్ క్రౌన్, ఆర్బ్, సెప్టెర్ ఉంచుతారు. ఒకసారి హాల్ కు శవపేటికను తీసుకొచ్చిన తర్వాత ఆమెను చూసేందుకు ప్రజలకు అనుమతిస్తారు.

వెస్ట్ మినిస్టర్ అబేలో మరో రెండు వారాల్లో రాణి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తేదీ ఎప్పుడు ఉంటుందో బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటిస్తుంది.

అబే అనేది ఒక చారిత్రక ప్రాధాన్యమున్న చర్చి. బ్రిటన్ రాజులు, రాణులు ఇక్కడే పట్టాభిషిక్తులు అవుతారు. ఎలిజబెత్ 2 కూడా 1953లో ఇక్కడే రాణిగా మారారు. మరోవైపు ప్రిన్స్ ఫిలిప్ తో 1947లో ఆమె పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. 18వ శతాబ్ధం తర్వాత అబేలో ఒక్క రాజ కుటుంబ అంత్యక్రియలు కూడా జరగలేదు. 2002లో రాణి తల్లి అంత్యక్రియలను కూడా చేపట్టలేదు. రాణిని నివాళులు అర్పించేందుకు ప్రపంచదేశాల నాయకులు రానున్న రోజుల్లో బ్రిటన్ కు రాబోతున్నారు. చివరగా రాయల్ వాల్డ్ లో రాణి శవపేటికను ఉంచుతారు.