Begin typing your search above and press return to search.

కోర్టుకు వెళ్లాను.. వైట్ హౌస్ ఖాళీ చేయనని ట్రంప్ మొండికేస్తే?

By:  Tupaki Desk   |   5 Nov 2020 12:10 PM GMT
కోర్టుకు వెళ్లాను.. వైట్ హౌస్ ఖాళీ చేయనని ట్రంప్ మొండికేస్తే?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఇప్పటివరకు అధ్యక్ష పదవిని చేపట్టిన వారికి భిన్నమైన తీరు డొనాల్డ్ ట్రంప్ దన్న విషయం తెలిసిందే. మొండితనం.. అంతకు మించిన పెడసరితనం ఆయన సొంతం. ఓవైపు ఓటమి దగ్గరకు వచ్చిన వేళ.. ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతోంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఫలితాలు వెల్లడి కావాల్సిన రాష్ట్రాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చి.. ఆయన ఓడిన పరిస్థితి ఉంటే.. ఆయన అందుకు ఓకే చెప్పి.. వైట్ హౌస్ ఖాళీ చేస్తారా? అన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే తాను గెలిచినట్లుగా పేర్కొన్న ట్రంప్.. ఓట్ల లెక్కింపుపై సందేహాలతో అత్యుత్తమ న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో.. ఆయన తీరు ఎలా ఉండనున్నది? అన్నది ప్రశ్నగా మారింది. బైడెన్ గెలిచినట్లు తేలిన తర్వాత.. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ ను ఆయన ఖాళీ చేయనని చెబితే ఏం జరుగుతుంది? అప్పుడేం చేయాలి? ఆయన్ను ఖాళీ చేయించే బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

అమెరికా రాజ్యంగంలో కానీ.. నిబంధనల్లో కానీ దేశాధ్యక్షుడు తన అధికార నివాసాన్ని ఖాళీ చేయకపోతే ఏం చేయాలన్న విషయాన్ని పేర్కొనలేదని చెబుతున్నారు. అయితే.. కొన్ని అమెరికన్ మీడియా సంస్థల కథనాల ప్రకారం మాత్రం సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే కీలక భాద్యతగా తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన నూతన అధ్యక్షుడికి.. పాత అధ్యక్షుడ్ని వైట్ హౌస్ నుంచి ఖాళీ చేయించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెబుతున్నారు.

కొత్త అధ్యక్షుడు అప్పటికే ఎంపిక కావటంతో పాత అధ్యక్షుడికి ప్రోటోకాల్ కూడా వర్తించదని చెబుతున్నారు. ట్రంప్ కానీ ఖాళీ చేయటానికి మొండికేస్తే.. ఆయన చేత ఎలా ఖాళీ చేయించాలన్న అంశంపై ప్రత్యేకంగా పేర్కొనకపోయినా.. దీనికి సంబంధించిన వ్యవహారాల్ని సీక్రెట్ సర్వీసెస్ చూస్తారని చెబుతున్నారు. ఏమైనా.. అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటే మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొనటం ఖాయమని చెప్పక తప్పదు.