Begin typing your search above and press return to search.

వైరల్:ఐటీ ఉద్యోగి అంటే ఎంత చుల‌క‌న బాసూ!

By:  Tupaki Desk   |   7 July 2017 1:02 PM GMT
వైరల్:ఐటీ ఉద్యోగి అంటే ఎంత చుల‌క‌న బాసూ!
X
ఐటీ జీవులంటే చాలు.. ఐదు అంకెల జీతంతో ద‌ర్జాగా బ‌తికేస్తార‌న్న ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. వారానికి ఐదు రోజుల ప‌ని.. టిప్పు టాప్ గా ఆఫీసుకు వెళుతూ.. వారాంతంలో యమా ఎంజాయ్ చేస్తార‌ని.. పార్టీల‌తో కులాశాగా బ‌తికేస్తుంటార‌న్న ఫీలింగ్ లో ఉంటారు. అంతేకానీ.. టార్గెట్ల క‌త్తి అంచుల మ‌ధ్య వారి జీవితం ఉంటుంద‌ని.. వారికున్న ఒత్తిడి జీవితం మ‌రెవ‌రికీ ఉండ‌ద‌న్న విష‌యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోరు.

ఒక‌ప్పుడు ఇంటి అల్లుళ్ల‌ను చూసినట్లే ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని చూసేవి. కానీ.. కాలం తెచ్చిన మార్పుల‌తో ఏవో కొద్ది కంపెనీలు త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీ ఎంత‌గా ముదిరిపోవాలో అంత‌గా ముదిరిపోయాయి. ఉద్యోగం ఇచ్చేట‌ప్పుడు స‌వాల‌చ్చ పేప‌ర్ల మీద లెక్క‌లేన‌న్ని సంత‌కాలు పెట్టించేసుకొని.. ఉద్యోగి జీవితాన్ని త‌మ చేతుల్లోకి తీసేసుకోవ‌టం.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి పంపేయ‌టం మామూలుగా మారింది.

ఐటీ వాళ్ల క‌ష్టాలు చెబితే చాలామంది ఓ ప‌ట్టాన న‌మ్మ‌రు. ఎందుకులే బాసూ.. పీత క‌ష్టాలు చెబుతావు అని సింపుల్ గా తీసిపారేస్తుంటారు. అయితే.. ఐటీ జీవుల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయో.. వారి ప‌ట్ల కంపెనీలు ఎంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయో అన్న దానికి నిద‌ర్శ‌నంగా ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ ఆడియో క్లిప్ విన్న వారంతా.. అయ్యో అన‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. ఎలాంటి కార‌ణం లేకుండా.. ఉద్యోగి త‌ప్పు చేయ‌కుండానే..కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధి టైం ఇచ్చేసి మ‌రీ ఉద్యోగాన్ని మానేయాల‌ని ఆర్డ‌ర్ వేసే ఐటీ కంపెనీల హెచ్ ఆర్ వాళ్లు ఎంత క‌ఠినంగా ఉంటార‌న్న విష‌యాన్ని తాజా ఆడియో క్లిప్ స్ప‌ష్టం చేస్తోంది. ఇంత‌కీ ఆ ఆడియో క్లిప్ లో ఏముంద‌న్న‌ది చూస్తే.. సంస్థ పున‌ర్నిర్మాణంలో భాగంగా ఉద్యోగాల‌ను తొల‌గిస్తున్న‌ట్లుగా చెప్పే హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్.. కార్పొరేట్ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌ట‌మే త‌న ప‌ని అంటూ ఉద్యోగిని త‌న ఉద్యోగానికి రాజీనామా చేయాల‌ని ఆదేశించ‌టం స్ప‌ష్టంగా వినిపిస్తుంది.

6.45 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్ లో స‌ద‌రు ఐటీ ఉద్యోగిని త‌న‌కు తానుగా త‌న ఉద్యోగానికి రాజీనామా చేయాల‌ని.. ఒక‌వేళ చేయ‌కుంటే ఉద్యోగం నుంచి తీసేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంటున్న వైనం సంచ‌ల‌నంగా మారింది. ఒక రోజు స‌మ‌యం కూడా ఇవ్వ‌కుండా ఇలా చెబుతారేంటంటే.. మీరు ఉద్యోగంలో చేరేట‌ప్పుడు సంత‌కాలు చేసిన పేప‌ర్ల‌ను గుర్తు తెచ్చుకోండి. అందులో ఉన్న రూల్స్ ప్ర‌కార‌మే కంపెనీ న‌డుచుకుంటుంద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ఖ‌ర్చుల నియంత్ర‌ణ‌లో భాగంగా ఉద్యోగుల్ని తీసేయాల‌ని కంపెనీ నిర్ణ‌యించింద‌ని.. అందులో మీ పేరు కూడా ఉంద‌ని.. మీకు మీరుగా రాజీనామా చేస్తే.. సాధార‌ణంగా కంపెనీ నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా భావించి రిలీవ్ చేస్తామ‌ని.. అలా కాకుంటే మాత్రం ఉద్యోగం నుంచి తీసేసినట్లుగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొన‌టం.. అందుకు ఆ ఐటీ ఉద్యోగి.. ఇంత త‌క్కువ టైంలో అంటే మిగిలిన క‌మిట్ మెంట్ల సంగ‌తేమిటంటూ అడ‌గటం క‌నిపిస్తుంది.

ఎంత ప్రాధేయ‌ప‌డినా.. కాస్త స‌మ‌యం ఇవ్వ‌మ‌ని అడిగినా.. నో అంటే నో చెప్పేయ‌ట‌మేకాదు.. తాను మొద‌ట ఏదైతే చెప్పారో.. అదే విష‌యాన్ని అదే ప‌నిగా చెప్పి.. రాజీనామా చేస్తారా? ఉద్యోగం నుంచి తీసేయ‌మంటారా? ఏదో ఒక‌టి తేల్చుకోండంటూ హుకుం జారీ చేసిన వైనం ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

ఐటీ ఉద్యోగుల వెత‌లు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపించే ఈ ఆడియో.. ఒక ప్ర‌ముఖ ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగితో.. హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడిన‌దిగా చెబుతున్నారు. త‌న‌కు వేరే దారి లేద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. స‌ద‌రు ఉద్యోగి హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ తో వాదించ‌టం క‌నిపిస్తుంది. ఎంత మాట్లాడినా.. రాజీనామా చేస్తావా? జాబ్ నుంచి తీసేయాలా? అన్న రెండు ప్ర‌శ్న‌లు మాత్ర‌మే హెచ్ ఆర్ అమ్మాయి మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. తన విధుల్ని తాను బాగానే నిర్వ‌హిస్తున్నాన‌న్న విష‌యాన్ని స‌ద‌రు ఐటీ ఉద్యోగి ప్ర‌స్తావించ‌గా.. అందుకే ఫోన్ చేసి ఆప్ష‌న్ ఇస్తున్న‌ట్లు చెప్ప‌టం చూస్తే.. ఐటీ కంపెనీల తీరు ఇలా ఉంటుందా? అని షాక్ తిన‌క మాన‌దు.