Begin typing your search above and press return to search.

నేను పార్టీని వీడ‌లేదు:కృష్ణ‌య్య‌

By:  Tupaki Desk   |   11 Sep 2018 11:19 AM GMT
నేను పార్టీని వీడ‌లేదు:కృష్ణ‌య్య‌
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ ఎస్ ను గ‌ద్దె దించేందుకు కాంగ్రెస్ , టీడీపీలు పొత్తు పెట్టుకునేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ఊహాగానాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ పొత్తుల ఎత్తుల‌తో కొంత‌మంది తెలుగు త‌మ్ముళ్లు చిత్త‌వుతున్నార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు వ‌ల్ల త‌మ సీట్లు గ‌ల్లంత‌వుతాయ‌ని, అదీ గాక కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డ్డ పార్టీలో ఉంటూ ఆ పార్టీతో పొత్తు ఏమిట‌ని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే - బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య టీడీపీకి రాజీనామా చేయ‌బోతున్నారంటూ పుకార్లు వ‌చ్చాయి. పొత్తుల వ్యవహారంలో చంద్రబాబు తనను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌ని ఆయ‌న అలిగార‌ని టాక్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆ పుకార్ల‌పై కృష్ణ‌య్య స్పందించారు.

తాను పార్టీ వీడుతున్న‌ట్లు వ‌స్తోన్న‌ పుకార్ల‌లో వాస్త‌వం లేద‌ని కృష్ణ‌య్య అన్నారు. తాను టీడీపీలోనే ఉన్నాన‌ని, పార్టీకి రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు వ‌స్తోన్న ఊహాగానాలు నిజం కాద‌ని అన్నారు. అయితే, కొంత‌కాలంగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు కృష్ణ‌య్య దూరంగా ఉంటున్నారు. మొన్న‌ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మావేశానికి కూడా కృష్ణ‌య్య హాజ‌రు కాలేదు. గ‌తంలో ఆయ‌న పార్టీకి వ్య‌తిరేకంగా చేసిన కామెంట్స్ వ‌ల్లే ఆయ‌న‌ను దూరంపెడుతున్నార‌ని టాక్. దాంతోపాటు, టీఆర్ ఎస్ లో చేరేందుకు కృష్ణ‌య్య ప్ర‌య‌త్నించార‌ని, అది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం వ‌ల్లే ఇపుడు ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. కృష్ణ‌య్య రాక కేసీఆర్ కు ఇష్టం లేద‌ని తెలుస్తోంది. మ‌రి, ఇంత జ‌రిగిన త‌ర్వాత‌....కృష్ణ‌య్య‌కు టీడీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కుతుందా...లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.