Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను మెచ్చుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   4 Dec 2017 4:50 AM GMT
కేసీఆర్‌ ను మెచ్చుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే
X
అవును. ఆయ‌న టీడీపీ గుర్తుపైనే ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారే త‌ప్ప జంప్ చేసి పార్టీ మార‌లేదు. పార్టీ సిద్ధాంతాలు అంటే విశ్వాసం కూడా! కానీ ఆయ‌న తెలుగుదేశం పార్టీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. అదే స‌మ‌యంలో టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్ర‌బాబుపై మాత్రం....దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్ర‌బాబు తీరు ఏమాత్రం న‌చ్చ‌లేద‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టిస్తూనే...ఏకంగా ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అదేంటి ఎందుక‌లా అంటే...ఆయ‌న సిద్ధాంత‌మే ఇలా మాట్లాడించేలా చేస్తోంది. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రంటే...బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు - ఎల్‌ బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య‌.

త‌న‌కు టికెట్ ఇచ్చి గెలిపించిన టీడీపీ అధినేత‌ - ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఆర్‌.కృష్ణ‌య్య ఎందుకు విరుచుకుప‌డుతున్నాడో తెలిసిందే. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ హామీని మూడున్న‌రేళ్ల త‌ర్వాత ఏపీ సీఎం చంద్ర‌బాబు నిలుపుకొన్న సంగ‌తి తెలిసిందే. బీసీ ఎఫ్ కోటా కింద ఇచ్చే ఈ రిజ‌ర్వేష‌న్ల‌పైనే ఆర్‌.కృష్ణ‌య్య భ‌గ్గుమంటున్నారు. ఈ నిర్ణ‌యం రాజ‌కీయాల కోణంలో బాబు తీసుకుంటున్నప్ప‌టికీ...బీసీల జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసేద‌ని మండిప‌డుతున్నారు. బాబు నిర్ణ‌యం బీసీల‌కు తీవ్ర‌మైన అన్యాయం చేస్తుంద‌ని పేర్కొంటూ దీన్ని వెన‌క్కు తీసుకోక‌పోతే...తాను ఆందోళ‌న చేస్తాన‌ని ఆర్‌.కృష్ణ‌య్య‌ ప్ర‌క‌టించారు. అంతేకాదు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా గుడ్ బై చెప్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇలా బాబును బెదిరించిన కృష్ణ‌య్య తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఆకాశానికి ఎత్తేశారు.

బీసీల‌కు ఏం చేయాల‌నే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పార్టీల‌కు చెందిన బీసీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల‌తో అసెంబ్లీలో స‌మావేశం అయిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన వారిలో పార్టీలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యే అయిన ఆర్.కృష్ణ‌య్య ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్య‌మంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. బీసీ సంక్షేమం పై సమావేశం పెట్టటం చరిత్రాత్మ‌క‌మైన‌ గొప్ప విషయమ‌ని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య తెలిపారు. పార్టీలకు అతీతంగా సమావేశం పెట్టటం గొప్ప విషయమ‌ని కొనియాడారు. పార్లమెంటులో బిల్లు పెట్టడం కోసం - ప్రధానిని కలిసేందుకు అఖిలపక్షంను ఢిల్లీ తీసుకెళతామని సీఎం కేసీఆర్ అన్నారని ఇది ఆహ్వానించ‌ద‌గ్గ విష‌యమ‌న్నారు. అన్ని అంశాలపై చర్చించి బీసీ డిక్లరేషన్ ఇస్తే సీఎం అమలు చేస్తామన్నారని ఇది ఎమ్మెల్యేలుగా త‌మ‌కు సంతోష‌క‌ర‌మ‌ని ఆర్‌.కృష్ణ‌య్య ఆనందం వ్య‌క్తం చేశారు.