Begin typing your search above and press return to search.

మ‌హానాడుకు డుమ్మాకొట్టిన కొట్టిన ఆర్‌.కృష్ణ‌య్య‌

By:  Tupaki Desk   |   24 May 2017 3:36 PM GMT
మ‌హానాడుకు డుమ్మాకొట్టిన కొట్టిన ఆర్‌.కృష్ణ‌య్య‌
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ త‌గిలింది. తెలంగాణ తెలుగుదేశం మహానాడుకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డుమ్మా కొట్టారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ లో తెలంగాణ తెలుగుదేశం మహానాడుకు ఎల్బీ నగర్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య హాజరు కాలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ఎమ్మెల్యే రాకపోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కృష్ణయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పేరుకి టీడీపీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ కృష్ణయ్య బీసీ సంఘం నేత‌గానే వ్యవహరిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రీతో కూడా స‌మావేశం అయిన సంగ‌తి తెలిసిందే.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మినీ మహానాడు సంద‌ర్భంగా టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌ రమణ మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగు నింపిన పార్టీ టీడీపీ అని, కేసీఆర్‌ సహా ఎంతో మందికి పార్టీ రాజకీయ జీవితాన్నిచ్చిందని అన్నారు. చంద్రబాబు నాయుడు నిర్మించిన సైబరాబాద్‌ వల్లే తెలంగాణ రాష్ట్రం నేడు ధనిక రాష్ట్రంగా మారిందని కొనియాడారు. ఇప్పటి వరకూ కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, గిట్టుబాటుధర రాక రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ర‌మ‌ణ విమర్శించారు.

తెలంగాణ తెలుగుదేశం మహానాడు ప్రారంభానికి ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ కు తెలంగాణ తెలుగుదేశం త‌ర‌ఫున‌ గుణపాఠం చెబుతామన్నారు. భావ సారూప్యత ఉండి, కలిసి వచ్చే పార్టీలతో కలిసి పని చేయడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అవకాశవాదులే తెలుగుదేశం పార్టీని వీడారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను గౌరవించడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ పాలన నీరో చక్రవర్తిని తలపిస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా త‌మ‌ గొంతు నొక్కుతున్నారన్నారు. గతంలో ఎవరూ వాడని విధంగా పోలీస్‌ వ్యవస్థను వాడుతున్నారన్నారు. ప్రజల మధ్య అశాంతి నెలకొల్పి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని వీర‌య్య ఆరోపించారు.