Begin typing your search above and press return to search.

గులాబీ కారు హార‌న్ కు రియాక్ట్ కావ‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   31 Jan 2018 6:07 AM GMT
గులాబీ కారు హార‌న్ కు రియాక్ట్ కావ‌ట్లేద‌ట‌
X
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీఆర్ ఎస్ ఇప్పుడో హాట్ టాపిక్. ఆ పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో అంద‌రి దృష్టి ప‌డేలా చేస్తున్న కేసీఆర్‌.. ఊ అనాలే కానీ.. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న వారు భారీగా ఉన్నార‌ట‌. ఇంత మంది ఇంత ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ క‌న్ను మాత్రం బీసీ హ‌క్కుల కోసం పోరాడుతున్న ఆర్ కృష్ణ‌య్య మీద ఉన్న‌ట్లు చెబుతున్నారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కృష్ణ‌య్య‌ను తెలంగాణ టీడీపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే కృష్ణ‌య్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని చెప్పి.. ఎల్ బీ న‌గ‌ర్ లో ఆయ‌న్ను స్వ‌యంగా బ‌రిలోకి నిలిపారు. బాబు లెక్క‌లు నిజ‌మై ఎల్ బీ న‌గ‌ర్ లో కృష్ణ‌య్య విజ‌యం సాధించినా.. పార్టీ చెప్పుకోద‌గిన రీతిలో సీట్ల‌ను సాధించ‌లేక‌పోయింది.

పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార‌పార్టీ గూట్లోకి వెళ్లిపోగా.. రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. నామ‌మాత్రంగా ఉన్న టీడీపీలో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్న కృష్ణ‌య్య‌ను గులాబీ కారులో ఎక్కించాల‌న్న ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రికేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీసీల‌కు ఫేస్ గా కృష్ణ‌య్య‌ను పెట్టుకోవ‌టానికి వీలుగా ఆయ‌న్ను పార్టీలోకి తేవాల‌ని కేసీఆర్ భావిస్తున్నా.. ఆయ‌న మాత్రం ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌టం లేద‌ని చెబుతున్నారు.

పార్టీలో చేరితే వెనువెంట‌నే రాజ్య‌స‌భ సీటు ఇప్పించి ఢిల్లీకి పంప‌టంతో పాటు.. రెండో ద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర మంత్రి ప‌ద‌వి అప్ప‌చెబుతామ‌ని కేసీఆర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. కృష్ణ‌య్య సానుకూలంగా లేర‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల లోపు కృష్ణ‌య్య‌ను పార్టీలోకి తీసుకురావ‌టం ద్వారా బీసీల మ‌న‌సుల్ని దోచుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ పిలుపు కోసం ఎంతోమంది ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటే.. కృష్ణ‌య్య మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.