Begin typing your search above and press return to search.

నాకు టీడీపీ స‌భ్య‌త్వ‌మే లేదు..పార్టీతో ప‌నేంటి?

By:  Tupaki Desk   |   5 May 2018 4:38 AM GMT
నాకు టీడీపీ స‌భ్య‌త్వ‌మే లేదు..పార్టీతో ప‌నేంటి?
X
బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు - ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ నేత‌ల దిమ్మ తిరిగిపోయే వ్యాఖ్య‌లు చేశారు. కొద్దికాలంగా టీడీపీతో అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న ఈ బీసీ నేత పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో త‌న సంఘానికి పొమ్మ‌న‌లేక‌ పొగ‌బెట్టిన‌ట్లు టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు వ్యవ‌హ‌రిస్తున్నార‌ని భావిస్తూ ఆయ‌నీ విధంగా ఉన్నార‌ని టాక్‌. మ‌రోవైపు పార్టీ సైతం ఆయ‌న్ను పెద్ద‌గా లెక్క‌ల్లోకి తీసుకోక‌పోతుండ‌టంతో ఈ గ్యాప్ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆర్‌.కృష్ణ‌య్య ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు త‌న‌కు టీడీపీలో స‌భ్య‌త్వమే లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఉద్యోగ పోస్టులను ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లో నిర్వహించిన సభకు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం వద్దలేదని, పాలకులను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. యువ‌త‌లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వ‌డం మంచిది కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అనంత‌రం విలేక‌రుల‌తో తాను టీడీపీ నాయ‌కుడిని అని ఏరోజూ, ఎక్కడా చెప్పలేదని తెలిపారు. అస‌లు తాను టీడీపీ సభ్యత్వం తీసుకోలేదని ఆర్‌.కృష్ణ‌య్య అవాక్క‌య్యే వ్యాఖ్య‌లు చేశారు.

మీరు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫునే పోటీ చేశారు క‌దా అనే మీడియా ప్ర‌శ్న‌కు ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య స్పందిస్తూ బీసీ సంఘంతో టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడు చేసుకున్న ఒప్పందం ప్రకారమే నాటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తనను పోటీ చేయించారని గుర్తుచేశారు. ఆంధ్రలో బీసీలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ఈ విష‌యంలో తాను పోరాటం చేస్తుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన బాబు ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.