Begin typing your search above and press return to search.

సీఎం కేండిడేట్ కల.. అందని ద్రాక్షే!

By:  Tupaki Desk   |   23 Oct 2017 11:30 PM GMT
సీఎం కేండిడేట్ కల.. అందని ద్రాక్షే!
X
తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, తనకు సంబంధించి ఆ హోదాను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఆర్.కృష్ణయ్య. ఎమ్మెల్యే అనడం కంటె.. బీసీసంఘాల నాయకుడు అంటేనే ఆయన ఎక్కువ సంతోషిస్తారు. అయితే ఆయన వద్దనుకున్నా సరే.. ఆయన మీద తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక ముద్ర ఉంది. తెలుగుదేశం గెలిస్తే.. ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తాం అంటూ... చంద్రబాబునాయుడు బీసీ ఓట్లకు ఎరవేసినట్లుగా గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించారు. అప్పట్లో బాబు వ్యూహం అర్థం కాక బరిలోకి దిగిన ఆర్.కృష్ణయ్య తాను గెలిచారు గానీ... సీఎం కాలేదు. తెదేపా అంటే కూడా క్రమంగా విముఖత పెంచుకున్నారు. అయితే.. తాజాగా ఆయన వ్యక్తం చేస్తున్న కోరిక మాత్రం.. ప్రాక్టికల్ గా అందని ద్రాక్షే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీ రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జన సభలో ఆయన తన కోరికను బయటపెట్టారు. బీసీల రాజకీయ పార్టీ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపు ఇచ్చారు. అయితే చిన్న చిన్న బీసీ కులాలు అన్నీ కూడా సంఘటితంగా ఉండగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఆచరణలో చూసినప్పుడు బీసీలందరినీ.. బీసీలకు సంబంధించిన పథకాలు - తగాదాల వ్యవహారంలో తప్ప.. ఏకతాటి మీదకు తేవడం సాధ్యమేనా? ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేకుండా ఉండే కులాలు - నాయకులు బీసీల్లో ఉన్నారా? ఆయా పార్టీల్లో తమకు ఉన్న బంధాన్ని - హోదాను అన్నిటినీ వదులుకుని కేవలం కులాల ఓట్లు మాత్రమే నమ్ముకుంటూ పార్టీగా ఎదగడానికి సానుకూల వాతావరణం ఉంటుందా? అనే చాలా ప్రశ్నలు దీనికి అనుబంధంగా రేకెత్తుతున్నాయి.

ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆ పార్టీతో సంబంధం లేనట్లుగా మాట్లాడుతుంటారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన సందర్భాలు అనేకం. అలాగే.. కాపులకు రిజర్వేషన్ కల్పించే చంద్రబాబు హామీని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో.. తెదేపాతో బంధం ఇకపై ఉండకపోవచ్చు గానీ.. బీసీలకోసం ఒక పార్టీ స్థాపించాలనే ఆయన కోరిక మాత్రం క్లిక్ కాకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీసీల సంక్షేమం కోసం పోరాడే శక్తిగా కులసంఘాలు ఉంటే చాలునని, కొందరికి పదవులు దక్కించడం కోసం పార్టీలుగా సంఘాలు అవతరించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.